శ్రీహరికోటకు చేరుకున్న రాష్ట్రపతి

Update: 2019-07-14 13:55 GMT

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చంద్రయాన్‌ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా తిలకించనున్నారు. ఇప్పటికే శ్రీహరి కోటకు చేరుకున్న ఆయన.. ప్రయోగంలో పాల్గొన్న శాస్తవేత్తలు అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. ప్రయోగం విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు తెల్లవారు జామున కుటుంబ సమేతంగా రాష్ట్రపతి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. తెల్లవారుజామున తిరుమల వేంకటేశ్వర స్వామివారిని ‌ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శనివారం రాత్రే తిరుమలకు చేరుకున్న రాష్ట్రపతి.. ఉదయం వరాహ స్వామిని దర్శించుకుని, తరువాత శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

మొదట ఆనంద నిలయంలో శ్రీవారి మూల విరాట్‌ను దర్శించుకున్నారు. సబేరాలో అర్చకులు, అధికారులు రాష్ట్రపతిని స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. రంగనాయకుల మండపంలో రాష్ట్రపతి దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ వారికి స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాష్ట్రపతి పర్యటనలో గవర్నర్‌ నరసింహన్‌, ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.

మధ్యాహ్నం తిరుపతి విమానాశ్రయం నుంచి నేరుగా శ్రీహరి కోటకు చేరుకున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా.. శ్రీహరి కోటలో భారి భద్రత ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి జరగనున్న చంద్రయాన్ -2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. తరువాత తిరిగి తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి ప్రయాణమవుతారు.

Similar News