అర్థరాత్రి దాటిన తర్వాత అరుదైన, అద్భుత సన్నివేశం

Update: 2019-07-16 01:14 GMT

నేడు (మంగళవారం) అరుదైన, అద్భుత సన్నివేశం కనిపించనుంది. ఈరోజు అర్థరాత్రి దాటిన తర్వాత పాక్షిక చంద్రగ్రహణం సంభవించనుంది.. దీనికి కొన్ని గంటల ముందు గురుపౌర్ణిమ పర్వదినం రావడంతో నేడు విశేషమైన రోజుగా చెబుతున్నారు. నేడు (మంగళవారం ) అర్థరాత్రి తర్వాత ఏర్పడే పాక్షిక చంద్రగ్రహణం మూడు గంటల పాటు కనువిందు చేయనుంది. గ్రహణం సందర్భంగా ఆలయాలను మూసివేయనున్నారు.

ఆకాశంలో అద్భుతం కనిపించబోతోంది.. పాక్షిక చంద్ర గ్రహణం దేశవ్యాప్తంగా కనువిందు చేయనుంది. గురు పౌర్ణిమ పర్వదినం తర్వాత ఎనిమిది గంటల తేడాతో చంద్ర గ్రహణం ఏర్పడబోతోంది.. కొన్ని గంటల తేడాతో రెండు సందర్బాలు రావడం చాలా అరుదుగా జరిగే సంఘటనగా చెబుతున్నారు.. 1870 జూలై 12న ఒకే సమయంలో చంద్రగ్రహణం, గురు పౌర్ణమి వచ్చాయి. మళ్లీ 150 ఏళ్ల తర్వాత అలాంటి సందర్భం వస్తోంది. నేటి సాయంత్రం 4 గంటల వరకు గురుపౌర్ణమి ఘడియలు ఉండగా.. నేటి అర్థరాత్రి 12.12 గంటలకు చంద్రగ్రహణం మొదలై తెల్లవారుజాము 5.47 వరకు ఉంటుంది. ఈ ఏడాదిలో ఏర్పడే రెండో, చివరి చంద్రగ్రహణం ఇదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈరోజు అర్ధరాత్రి తర్వాత 12.12 గంటలకు చంద్రుడు భూమి ఉపఛాయలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో చంద్రుడి చుట్టూ పలుచని నల్లటి పొర ఆవరించినట్టు కనిపిస్తుంది. తర్వాత 1.31 గంటలకు భూమి ప్రచ్ఛాయలోకి చంద్రుడు ప్రవేశించడంతో గ్రహణం ప్రారంభమవుతుంది. ఉదయం 3 గంటల ప్రాంతంలో గరిష్ఠ గ్రహణం కనిపిస్తుంది. తర్వాత ఉదయం 4.30 గంటలకు ప్రచ్ఛాయ నుంచి బయటకు రావడంతో గ్రహణం ముగుస్తుంది. ఉదయం 5.49 గంటలకు భూమి ఉపచ్ఛాయ నుంచి చంద్రుడు బయటికి వస్తాడు.

అరుణాచల్‌ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాలు మినహా దేశంలోని ఎక్కడ నుంచైనా గ్రహణం స్పష్టంగా కనిపించనుంది. ఇక చంద్రగ్రహణాన్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వాటిచుట్టూ ఉన్న కొన్ని ద్వీపాలు, ఆఫ్రికాలో వీక్షింవచ్చు. భూమి ప్రచ్ఛాయలోకి చంద్రుడు ప్రవేశించే దృశ్యాన్ని న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఉత్తర, దక్షిణ కొరియా, రష్యాలోని కొన్ని ప్రాంతాల వారు స్పష్టంగా చూడొచ్చు. అలాగే గ్రహణం ముగిసి చంద్రుడు ఉదయించే దృశ్యాన్ని అర్జెంటీనా, చిలీ, బొలీవియా, పెరూ, దక్షిణ అట్లాంటిక్ సముద్రం, బ్రెజిల్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి స్పష్టంగా చూడొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.

చంద్రగ్రహణం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆలయాలు మూతపడనున్నాయి.. తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసుకోనున్నాయి.. ఈరోజు సాయంత్రం ఏడు గంటల నుంచి రేపు తెల్లవారుజాము ఐదు గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తారు.. సంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. భద్రాద్రి ఆలయ తలుపులను సాయంత్రం 6 గంటలకు మూసివేస్తారు.. తిరిగి రేపు తెల్లవారు జామున 5.30 నిమిషాలకు తెరిచి ఆలయశుద్ధి, సంప్రోక్షణ నిర్వహిస్తారు.. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. చంద్రగ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయం కూడా మూతబడనుంది. సాయంత్రం 6:30 నుంచి ఆలయాన్ని మూసివేస్తారు. రేపు ఉదయం 5:30 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణతో నిత్య విధులు నిర్వహిస్తారు. ఆర్జిత సేవలు నిలిపివేసి ఉదయం 9 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

Similar News