India vs China: సియాచిన్ సమీపంలో రోడ్డు

పీవోకేలో చైనా దురాగతం

Update: 2024-04-28 00:30 GMT

పాక్ ఆక్రమిత కశ్మీర్లోని సియాచిన్ గ్లేసియర్ కు అతి సమీపంలో చైనా  శర వేగంగా కొత్తగా రహదారిని నిర్మిస్తోంది.  ఈ విషయాన్ని ఉపగ్రహ ఆధారిత ఛాయాచిత్రాల ద్వారా భారత రక్షణ శాఖ నిపుణులు వెల్లడించారు. గత ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్యలోనే ఈ రోడ్డు నిర్మాణ పనులు స్టార్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ నిర్మాణం పూర్తిగా భారతదేశ ప్రాదేశికత సమగ్రతల ఉల్లంఘన కిందికే వస్తుందని నిపుణులు తెలిపారు. దేశ సార్వభౌమాధికారికతను కించ పరిచే చర్యగా దీనిని భారత్ పరిగణిస్తుంది. ప్రపంచంలోనే అతి ఎతైన యుద్ధ ప్రాంతంగా సియాచిన్ గ్లేసియర్స్‌కు పేరు ఉంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ భాగంలో సియాచిన్ దగ్గర చేపట్టిన పనులు మౌలిక స్థాయిని దాటి ఇప్పుడు రహదార్ల ఏర్పాటు దిశగా కొనసాగుతున్నాయి.

కాగా, సియాచిన్‌కు ఉత్తర ప్రాంతంలో అత్యంత వ్యూహాత్మకంగా తమ బలాన్ని పెంచుకునేందుకు ప్లాన్ చేస్తుంది. దీంతో భారతదేశ భద్రతా వ్యవస్థకు డ్రాగన్ కంట్రీ సవాళ్లు విసురుతుంది. ఇక, పీఓకేలోని అత్యంత కీలకమైన షక్సగమ్ లోయ దాదాపు 5,300 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఈ మార్గాన్ని 1947 యుద్ధంలో పాకిస్థాన్ స్వాధీనం చేసుకుంది. దీని తరువాత, 1963లో ద్వైపాక్షిక సరిహద్దు ఒప్పందం ప్రకారం, పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని చైనాకు అప్పగించింది. ఇక్కడే ప్రస్తుత మార్గం చైనాలోని జిన్‌జియాంగ్ అనుసంధాన హైవే జీ- 219కు మరింత విస్తరణ రహదారి నిర్మాణాలు చేపట్టింది. ఈ రోడ్డు చివరి భాగం భారతదేశపు ఉత్తర చివరి భాగపు సియాచిన్ గ్లేసియర్‌లలోని ఇందిర కల్ లేదా ఇందిరా పాయింట్ దగ్గర ఉండే పర్వతాల వద్ద 50 కిలో మీటర్ల లోపున ముగుస్తుందని భారత రక్షణ శాఖ నిపుణులు వెల్లడించారు.

అయితే, ఈ ప్రాంతం చారిత్రాత్మకంగా కాశ్మీర్‌లో భాగం కాబట్టి భారతదేశం దీనిని ఎల్లప్పుడూ తన భూభాగంగా పరిగణిస్తుంది. ఇది భారతదేశానికి సంబంధించి అత్యంత కీలకమైన సైనిక స్థావరం.. ఈ ఫార్వర్డ్ పాయింట్ దగ్గరకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గత ఏడాది మార్చి నుంచి రెండుసార్లు వెళ్లి వచ్చారు. ఈ దశలోనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి చైనా దూకుడు పెంచింది. అయితే, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తీసిన ఉపగ్రహ చిత్రాలు గత ఏడాది జూన్, ఆగస్టు మధ్య రహదారిని నిర్మించినట్లు చూపుతున్నాయి.

Tags:    

Similar News