'ఉద్యమాలు, పోరాటాల ద్వారానే ప్రజలకు చేరువగా'

Update: 2019-07-16 16:25 GMT

ఉద్యమాలు, పోరాటాల ద్వారా ప్రజలకు చేరువగా ఉండాలన్న బీజేపీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ప్రజల సమస్యలే ఎజెండాగా పోరాడితే ప్రభుత్వంపై వ్యతిరేకత తేవడంతో పాటు తమకు మంచి మైలేజ్ వస్తుందనేది ఆ పార్టీ స్ట్రాటజీ. అందుకు అనుగుణంగా నేతలు తమ కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు వైఫల్యాలపై నేతలు మొదలు పెట్టిన పోరాటం.. దళితులు, గిరిజనుల సమస్యలతో పాటు నిరుద్యోగుల బాధలు, ఉద్యోగుల కష్టాలపై కొనసాగింది. వీటితో కాషాయం జనాల్లోకి వెళ్తోందని చెబుతున్నారు పార్టీ నేతలు.

రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన ప్రతీ చోట బీజేపీ గళం వినిపించాలన్నదే ఆ పార్టీ లక్ష్యం. జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై కేంద్రానికి ఫిర్యాదు చేయాల్సిందిగా నాయకులకు దిశానిర్దేశం చేశారన్నది సమాచారం. సెక్రెటరీయేట్, అసెంబ్లీ కూల్చివేతకు నిరసనగా బీజేపీ చేస్తోన్న వినూత్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపైనా బీజేపీ కార్యాచరణ ప్రకటించింది. డ్రైనేజీలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులతో పాటు ఏయే రంగాలను కేసీఆర్ ఎలా మోసం చేస్తున్నారో.. ఆయా వర్గాల వారికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు కమలనాథులు.

ఇక పథకాల రూపంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులను రాష్ట్రం దారి మళ్లిస్తోందని బీజేపీ ఆరోపణ. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించింది. త్వరలో రానున్న మున్సిపల్ చట్టం, పుర ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందో కూడా బీజేపీ ఇప్పటినుండే బయటపెడుతోంది. మరోవైపు రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో రైతుల ఇబ్బందులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి నేతలు వినతి పత్రం సమర్పించారు.

ప్రజా సమస్యలపై పోరాటం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం..ప్రజలను చైతన్య పరచడం ద్వారా ఎన్నికల నాటికి బలపడాలని బీజేపీ టార్గెట్. పోరాటాలతో పోయేదేమి లేదనుకుంటున్న బీజేపీ కలలు ఫలిస్తాయా? కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలను అధిగమించి నిలబడగలరా అన్నది ఆసక్తిగా మారింది.

Similar News