Sand Mining: ఇసుక అక్రమ మైనింగ్‌ని అడ్డుకున్న పోలీస్ దారుణ హత్య
మధ్యప్రదేశ్‌లో రెచ్చిపోయిన ఇసుక మాఫియా;
మధ్యప్రదేశ్‌లో ఇసుక మాఫియా అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. అక్రమంగా ఇసుక తరలించి సొమ్ము చేసుకోవడం, ఎవరైనా అడ్డొస్తే ప్రాణాలు తీయడం వారి అలవాటుగా మారింది. తాజాగా షాదోల్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలకు మరో పోలీస్ అధికారి బలయ్యారు. ఇసుక అక్రమ తరలింపును అడ్డుకునేందుకు వెళ్లిన ఏఎస్‌ఐ మహేంద్ర బాగ్రీని ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం అందడంతో షాదోల్ జిల్లా కేంద్రానికి చెందిన ఏఎస్‌ఐ మహేంద్ర బాగ్రీ.. ప్రసాద్ కనోజీ, సంజయ్ దూబే అనే ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి ఘటనా ప్రాంతానికి వెళ్లారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌కు వారు అడ్డం తిరడంతో డ్రైవర్ ట్రాక్టర్‌ను ఆపకుండా తొక్కించాడు.
దాంతో ఏఎస్‌ఐ మహేంద్ర బాగ్రీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు కానిస్టేబుళ్లు తృటిలో తప్పించుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ట్రాక్టర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇంటరాగేషన్‌లో ఇసుక అక్రమ తరలింపులో ట్రాక్టర్ ఓనర్, ట్రాక్టర్ ఓనర్ కుమారుడికి పాత్ర ఉన్నట్లు తేలింది. దాంతో ట్రాక్టర్ ఓనర్ కుమారుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ట్రాక్టర్ ఓనర్ కోసం గాలిస్తున్నారు. గతేడాది నవంబర్‌లో షెహదోల్ ఇసుక మాఫియాకు చెందిన ట్రాక్టర్‌లో రెవెన్యూ శాఖ అధికారి ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే.