బీజేపీలో చేరికపై ఫైనల్‌గా తేల్చేసిన కోమటిరెడ్డి

Update: 2019-07-18 12:18 GMT

కొద్దికాలంగా సైలెంట్ మోడ్ లో ఉన్నా.. అసెంబ్లీ ప్రాంగణంలోకి వ‌చ్చిన కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మరోసారి తెగ క‌న్ఫ్యూజ‌న్ క్రియేట్ చేశారు. ముందుగా ఉద‌యం సీఎల్పీ స‌మావేశానికి డుమ్మాకొట్టిన ఆయ‌న .. ఆల‌స్యంగా అసెంబ్లీకి వ‌చ్చారు. స‌భ‌లో కాంగ్రెస్ స‌భ్యుల‌తో కూర్చున్నా .. స‌భ‌లో కాంగ్రెస్ చేస్తున్న నిర‌స‌న‌ల్లో మాత్రం పాల్గొన లేదు. స‌భ‌లో కాంగ్రెస్ స‌భ్యులు వాకౌట్ చేస్తున్న సంద‌ర్బంలో కూడా వారితో పాటు వాకౌట్ చేయ‌లేదు. కానీ స‌భ వాయిదా ప‌డ్డాక మాత్రం స్పీక‌ర్ ను క‌లిసేందుకు కాంగ్రెస్ స‌భ్యుల‌తో క‌లిసి వెళ్ళారు.

స్పీక‌ర్ తో క‌లిసేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌తో క‌లిసి వెళ్ళిన రాజ‌గోపాల్ రెడ్డి .. మ‌ళ్ళీ అంత‌లోనే మీడియా పాయింట్ లో మాత్రం కాంగ్రెస్ స‌భ్యుల‌తో విభేదించారు. తాను ఒంట‌రిగా మీడియాతో మాట్లాడారు. త‌మ‌తో క‌లిసి రావాల‌ని శ్రీ‌ధ‌ర్ బాబు అడిగినా .. వారితో క‌లిసి వెళ్ళ‌లేదు. మీడియాతో మాట్లాడిన ఆయ‌న తాను కాంగ్రెస్ స‌భ్యుడిన‌ని .. తాను కాంగ్రెస్ పై చేసిన వాఖ్య‌లు ఆవేద‌న‌తోనే మాట్లాడిన‌వేన‌ని చెప్పారు. రాహుల్ రాజీనామా చేసిన రాష్ట్ర నాయ‌కుల్లో ఎందుకు క‌ద‌లిక లేద‌ని ప్ర‌శ్నించారు.

తాను బీజేపీలో చేర‌తాన‌ని ఎప్పుడూ చెప్ప‌లేద‌న్నారు రాజ‌గోపాల్ రెడ్డి. మ‌ళ్ళీ అంత‌లోనే రాష్ట్రంలో బీజేపీనే ప్ర‌త్యామ్నాయ‌మ‌న్నారు. దేశంలో అంతా మోడీ హ‌వా న‌డుస్తుంద‌న్నారు. మీరు బీజేపీలో చేరుతున్నారా .. లేదా అన్న మీడియా ప్ర‌శ్న‌ల‌కు .. కాంగ్రెస్ నాపై యాక్ష‌న్ తీసుకోనివ్వండి .. అప్పుడు చెబుతాన‌న్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేను అంటున్నారు .. మ‌రి సీఎల్పీ మీటింగ్ కు ఎందుకు హ‌జ‌రుకాలేద‌న్న ప్ర‌శ్న‌కు సీఎల్పీ విలీనం అయ్యింది క‌దా .. ఇప్పుడు సీఎల్పీ లేదుక‌దా అంటు ఎదురు ప్ర‌శ్న‌లు వేశారు.

మొత్తానికి కొద్ది సేపు కాంగ్రెస్ బాగుకోసం ప్రేమ కురిపిస్తూ .. అంత‌లోనే బీజేపీ లో చేరతానని .. అంతలోనే నేను ఎప్పుడు అన్నాను అంటూ .. తాను ఏం చెప్ప‌ద‌లుచుకున్నారో కానీ .. ప్ర‌తి మాట‌లో తెగ క‌న్ఫ్యూజ‌న్ క్రియేట్ చేసే ప్ర‌య‌త్నం చేశారు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి.

Similar News