1984లో సంచలనం సృష్టించిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు 34 మందికి బెయిల్ మంజూరు చేసింది. సిక్కు అల్లర్ల కేసుకు సంబంధించి గతేడాది ఢిల్లీ హైకోర్టు 34మందికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునివ్వగా... వీరిలో 34 మంది ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన అత్యున్నత న్యాయస్థానం..తాజాగా వారందరికి బెయిల్ మంజూరు చేసింది.
34 మందికి బెయిల్ మంజూరు చేస్తూ చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ దీపక్ గుప్తా, అనిరుధ బోస్‌తో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. అయితే 34 మందిలో ఇప్పటికే ఒకరు జైల్లో మృతి చెందగా... 33 మంది త్వరలో జైలు నుంచి విడుదల కానున్నారు. అదేవిధంగా ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు 15 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇటీవలే ఇచ్చిన తీర్పుపై మరోసారి వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.
1984 అక్టోబరు 31న నాటి ప్రధాని ఇందిర గాంధీ హత్యానంతరం జరిగిన సిక్కు వ్యతిరేక అల్లరలో హింస చెలరేగింది. దాదాపు 3 వేల మంది చనిపోయారు. ఒక్క ఢిల్లీలోనే 2 వేల 2 వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ అంశం ఇప్పటికి దేశాన్ని కుదిపేస్తూనే ఉంది. అల్లర్లు, ఇళ్లదహనాలు, కర్ఫ్యూ ఉల్లంఘన వంటి నేరాలకు పాల్పడిన మొత్తం 89 మందికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సెషన్స్ కోర్టు 1996 ఆగస్టు 27న తీర్పు ఇచ్చింది. దీనిపై నిందితులంతా హైకోర్టుకు వెళ్లారు. దీంతో ఈ అప్పీళ్లపై విచారణ దాదాపు 22 ఏళ్లపాటు సుదీర్ఘంగా కొనసాగింది. తాజాగా ఢిల్లీలోని త్రిలోక్ పురిలో హింసకు పాల్పడిన 34 మందికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది.