FASTag Rules : ఫాస్టాగ్ వాహనదారులకు భారీ షాక్.. పెరిగిన వార్షిక పాస్ ధరలు.. కొత్త రూల్స్ ఇవే.
FASTag Rules : నేటి కాలంలో హైవేలపై ప్రయాణం అంటే ఫాస్టాగ్ తప్పనిసరి. నగదు రహితంగా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా టోల్ చెల్లింపులు చేసేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతోంది. అయితే, 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్ నిబంధనలలో మరియు ధరలలో కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా తరచూ ప్రయాణించే వారి కోసం ఇచ్చే వార్షిక పాస్ ధరను రూ.75 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు ఒక సంవత్సరానికి లేదా 200 టోల్ క్రాసింగ్‌ల కోసం ఈ పాస్ తీసుకోవాలంటే రూ.3,075 చెల్లించాల్సి ఉంటుంది. ఈ పాస్ తీసుకుంటే ప్రతిసారీ రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు, పేమెంట్ చేసిన రెండు గంటల్లోనే ఇది యాక్టివేట్ అవుతుంది.
వాహనదారులు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఫాస్టాగ్ కేవలం ఉండటమే కాదు, అది వాహనం విండ్ స్క్రీన్ (ముందు అద్దం) మీద నిబంధనల ప్రకారం సరిగ్గా అతికించి ఉండాలి. ఒకవేళ ఫాస్టాగ్ కారు లోపల ఎక్కడో పడేసినా లేదా సరిగ్గా స్కాన్ అవ్వని చోట పెట్టినా, టోల్ ప్లాజా వద్దకు రాగానే అధికారులు మీ నుండి రెట్టింపు టోల్ వసూలు చేస్తారు. టోల్ వద్ద అనవసర జాప్యాన్ని నివారించడానికి, ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు NHAI ఈ కఠిన నిబంధనను అమలు చేస్తోంది.
ప్రయాణికులకు కొంత ఊరటనిచ్చే వార్త కూడా ఒకటి ఉంది. జాతీయ రహదారులపై ఎక్కడైనా మరమ్మతులు లేదా రోడ్డు విస్తరణ పనులు (ఉదాహరణకు రెండు వరుసల నుంచి నాలుగు లేదా ఆరు వరుసలకు మార్చడం) జరుగుతుంటే, అక్కడ పూర్తి టోల్ కట్టాల్సిన అవసరం లేదు. రోడ్డు నిర్మాణం పూర్తయ్యే వరకు పాత టోల్ ధరలో కేవలం 50 శాతం మాత్రమే వసూలు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఉదాహరణకు ఒక చోట టోల్ రూ.50 ఉంటే, రోడ్డు పనులు సాగుతున్నప్పుడు మీరు కేవలం రూ.25 కడితే సరిపోతుంది. ఇది వాహనదారులకు పెద్ద ఊరట అని చెప్పొచ్చు.
ఒకవేళ మీ వాహనానికి ఫాస్టాగ్ లేకపోతే లేదా ఉన్నది పనిచేయకపోతే, టోల్ ప్లాజా వద్ద నగదు రూపంలో చెల్లిస్తే డబుల్ ఛార్జ్ పడుతుంది. కానీ, అదే సమయంలో మీరు యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే మాత్రం వాహన కేటగిరీని బట్టి కేవలం 1.25 రెట్లు మాత్రమే ఛార్జీ వసూలు చేస్తారు. అంటే క్యాష్ కంటే యూపీఐ ద్వారా కొంత తక్కువ భారం పడుతుందన్నమాట. ఇక ఫాస్టాగ్ కు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా 1033 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయవచ్చు. అలాగే రాజమార్గ యాత్ర యాప్ ద్వారా సమీపంలోని పెట్రోల్ పంపులు, ఆసుపత్రులు, వాతావరణ సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు.