చిన్నారులపై లైంగిక నేరాలను విచారించేందుకు పోక్సో చట్టం కింద ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. చిన్నారులపై లైంగిక నేరాలపై సుమోటోగా తీసుకుని విచారణ జరిపింది సుప్రీంకోర్టు. పోక్సో చట్టం కింద నమోదైన కేసులు వందకుమించి ఉంటే ఆయా జిల్లాల్లో కేంద్ర నిధులతో 60 రోజుల్లో ఈ కోర్టులు ఏర్పాటు చేయాలని సీజే గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ఇందుకోసం సుశిక్షితులైన, చైతన్యవంతులైన ప్రాసిక్యూటర్లు, సహాయ సిబ్బందిని నియమించాలని ఆదేశించింది కోర్టు.
ఈ కేసుల్లో ఫోరెన్సిక్ నివేదికలు వీలైనంత త్వరగా వచ్చేలా చూడాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధానకార్యదర్శులను సుప్రీంకోర్టు ఆదేశించింది. 30 రోజుల్లో పురోగతి నివేదిక సమర్పించాలని సోలిసిటర్ జనరల్‌కు ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు. ఈ ఏడాది జనవరి 1 నుంచి జూన్ 30 నాటి వరకు పోస్కో చట్టం కింద 24,212 కేసులు నమోదైనట్లు కోర్టు వెల్లడించింది. వీటిలో 11,981 కేసులను పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 12,231 కేసుల్లో ఛార్జిషీటు దాఖలుకాగా...కేవలం 6,449 కేసుల్లో మాత్రమే దర్యాప్తు పూర్తయ్యింది. 911 కేసుల్లో మాత్రమే తీర్పు వెలువడింది. చిన్నారులపై లైంగిక నేరాల కేసుల అవరోధాలు తొలగింపుపై ధర్మాసనం అంతకముందు సుదీర్ఘంగా చర్చించింది. ఈ కేసులో అమికస్ క్యూరెగా సీనియర్ న్యాయవాది వి.గిరి వ్యవహరించారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లు తగిన సంఖ్యలో లేకపోవడంతో అనేక కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని ఆయన ధర్మాసనానికి చెప్పారు.