AMARAVATHI: వైసీపీ అధినేత జగన్‌కు అమరావతి రైతుల హెచ్చరిక
అమరావతి జోలికొస్తే ఊరుకోబోమని వార్నింగ్
రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అమరావతి రైతులు, ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, జగన్ వైఖరిపై ఘాటు విమర్శలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి అభివృద్ధి పనులు ఊపందుకున్నాయని, ఇప్పుడు అదే అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న భావన వ్యక్తం చేశారు. “ఇప్పుడు సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని” అన్న తరహా వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని రైతులు పేర్కొన్నారు. రాజధాని నిర్ణయం వ్యక్తుల ఇష్టానుసారం మారదని, అది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని స్పష్టం చేశారు. అమరావతి అంశాన్ని రాజకీయం చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు సరికాదని హెచ్చరించారు.
ఆదివారం జరిగిన ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నేతలు మాట్లాడుతూ, అమరావతి ఉద్యమమే కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను గౌరవించకుండా రాజధాని అంశంపై వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అమరావతిని “స్మశానం, ఎడారి”గా అభివర్ణించిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, ఆ మాటలకు ప్రజలు ఎన్నికల్లో సరైన సమాధానం చెప్పారని అన్నారు. అదే కారణంగా వైసీపీకి పరిమిత స్థానాలు మాత్రమే వచ్చాయని అభిప్రాయపడ్డారు. జగన్ రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారని రైతులు ఆరోపించారు. రాజ్యాంగ వ్యవస్థను అపహాస్యం చేసేలా వ్యాఖ్యలు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికార పక్షంలో లోపాలుంటే ప్రతిపక్షంగా వాటిని ప్రశ్నించవచ్చని, కానీ రాజధాని అంశాన్ని ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు వాడుకోవడం తగదని స్పష్టం చేశారు.
“జగన్‌కు ధైర్యం ఉంటే 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి రావాలి” అంటూ రైతులు సవాల్ విసిరారు. గత ఐదేళ్ల పాలనలో జగన్ ఎక్కడి నుంచి పరిపాలన చేశారన్న ప్రశ్నను లేవనెత్తారు. జగన్ నివాసం కూడా అమరావతిలోనే ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు.