కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా నిమోనియాతో బాధపడుతున్న జైపాల్‌రెడ్డి.. అర్థరాత్రి ఒంటి గంట 20 నిమిషాలకు.. గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవలే హైఫీవర్‌తో ఆస్పత్రిలో చేరారు జైపాల్‌రెడ్డి. ప్రస్తుతం ఆయన వయస్సు 79 సంవత్సరాలు. ఇన్ని రోజులు తెలంగాణ కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగా మారిన జైపాల్‌రెడ్డి మృతితో ఆ పార్టీ శ్రేణులు విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతి పట్ల పలు పార్టీల నేతలు సంతాపం ప్రకటించారు.
మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గులలో 1942, జనవరి 16న జన్మించారు సూదిని జైపాల్‌రెడ్డి. ఆయనకు భార్య లక్ష్మీ, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. జైపాల్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎమ్ఏ పట్టా పొందారు. కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న జైపాల్‌రెడ్డి ఎన్నో పదవులను అధిరోహించారు. తొలిసారిగా కల్వకుర్తి నియోజకవర్గం నుండి 1969-1984 మధ్య నాలుగు సార్లు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. ముందుగా కాంగ్రెసు పార్టీ సభ్యునిగా ఉన్నా.. ఆ తరువాత ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ 1977లో జనతా పార్టీలో చేరారు. జనతా పార్టీలో 1985-1988 వరకు జనరల్ సెక్రటరీగా వ్యవహరించారు జైపాల్‌రెడ్డి.
1984లో మహబూబ్‌నగర్ లోకసభ స్థానం నుంచి తొలిసారిగా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు జైపాల్‌రెడ్డి. 1998లో ఐకే గుజ్రాల్ కేబినేట్‌లో సమాచారశాఖ మంత్రిగా పని చేశారు. 1999లో మళ్లీ కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరారు. ఆ తరువాత మిర్యాలగూడ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 1999, 2004లో రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2004లో పట్టాణిభివృద్ధి శాఖ మంత్రిగా.. 2009లో చేవేళ్ల పార్లమెంట్ స్థానం నుంచి ఎన్నికై పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రిగా.. 2012-2014 మధ్య కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా పని చేశారు జైపాల్‌రెడ్డి. రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన జైపాల్‌రెడ్డి...1998లో అత్యుత్తమ పార్లమెంటేరియన్ పురస్కారాన్ని అందుకున్నారు.