కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం అల్లుడు, కేఫ్ కాఫీ డే అధినేత వీజీ సిద్దార్ద అదృశ్యమయ్యారు. నిన్న రాత్రి నుంచి ఆయన కనిపించకుండపోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. సోమవారం ఉదయం వ్యాపారనిమిత్తం చిక్ మగళూర్ వెళ్లిన సిద్దార్ద అక్కడి నుంచి కేరళ బయలుదేరారు. మార్గమధ్యంలో జెప్పినమాగూరు నేత్రావతి నది వద్ద జాతీయ రహదారిపై కారు ఆపి దిగారు. ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్లారు. గంటసేపు చూసినా తిరిగిరాకపోవడంతో అనుమానం వచ్చిన డ్రైవర్ ఫోన్ చేశాడు. ఫోన్ కూడా స్విచాఫ్ చేసి ఉంది. ఇదే విషయం కుటుంబసభ్యులకు డ్రైవర్ చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో దక్షిణ కన్నడ పోలీసులు రంగంలో దిగి సిద్దార్ద కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నదిలో దూకారన్న అనుమానంతో ఆయన కోసం పడవలు, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు 130 మంది గజఈతగాళ్లు.. ఇతర రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు.
డ్రైవర్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే పోలీసులు కేసును విచారిస్తున్నారు. సిద్దార్ద కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రెండు ప్రత్యేక బృందాలను నియమించిన ఉన్నతాధికారులు సాధ్యమైనంత త్వరగా కేసు ఛేదించాలని భావిస్తున్నారు. నాలుగు కోణాల్లో పోలీసులు కేసు విచారిస్తున్నారు. నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారా? దోపిడీ దొంగలు ఫోన్, వస్తువులు లాక్కుని ఆయన్ను నదిలో పడేశారా? లేక కిడ్నాప్ జరిగిందా, ప్రమాదవశాత్తూ నదిలో పడ్డారా అన్న కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.