కృష్ణా నదికి వరద ఉధృతి కొనసాగుతోంది.. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి.. శ్రీశైలం రిజర్వాయర్‌లో గంటగంటకూ నీటిమట్టం పెరుగుతుంటే.. ఇటు సాగర్‌కు ఇప్పుడిప్పుడే కృష్ణమ్మ పరుగులు పెడుతోంది.. మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
గతవారం నుంచి పడిన వర్షాలకు తోడు.. ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. ఇన్‌ఫ్లో 2.48 లక్షల క్యూ సెక్కులుగా నమోదవుతోంది.. 55,182 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. శ్రీశైలం రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుత 126.66 టీఎంసీలకు చేరింది. భారీ వర్షాలు ఇలాగే కొనసాగి వరద పోటెత్తితే నాలుగు రోజుల్లో పూర్తిస్థాయిలో జలాశయం నిండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 8 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతుండడంతో పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని హెడ్ రెగ్యులేటర్ నుంచి 3 గేట్లను ఎత్తి తాగు, సాగునీటి కోసం నీటిని విడుదల చేశారు. సరైన వర్షాలు లేక పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయని.. ఈ దశలో నీటి విడుదలతో తమకు ఎంతో మేలు జరుగుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి వరద పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా పరివాహక ప్రాంతాల్లో నిర్మించిన డ్యాంలు ఇప్పటికే జలకళ సంతరించుకున్నాయి. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు 42,378 క్యూ సెక్కుల నీరు వచ్చి చేరుతోంది.. ప్రస్తుతం డ్యామ్‌లో నీటిమట్టం 508 అడుగుల మేరకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉంది. నాగార్జున సాగర్ పూర్తి నీటి నిలువ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 128.29 టీఎంసీలుగా ఉంది.
ప్రకాశం బ్యారేజ్ జలకళను సంతరించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నిండుకుండను తలపిస్తోంది.. బ్యారేజ్‌నుంచి 13లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తున్నారు. ఇక వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. బాలాసోర్‌కు ఆగ్నేయంగా 160 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మరో 24 గంటల్లో పశ్చిమ వాయువ్యదిశగా కదిలి తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.