అంపైర్ల అనాలోచిత నిర్ణయం కారణంగానే భారత్, సౌతాఫ్రికా నాలుగో టీ20 రద్దయ్యిందని మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ సందర్భంగా అంపైర్లు ఇంకిత జ్ఞానం లేకుండా వ్యవహరించారని మండిపడ్డాడు. బుధవారం లక్నో వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ విపరీతమైన పొగమంచు కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. టాస్ సమయానికే మైదానాన్ని పొగమంచు కమ్మేయడంతో పలు మార్లు మైదానాన్ని పరిశీలించి, విజిబిలిటిని పరీక్షించిన అంపైర్లు చివరకు మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మ్యాచ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన రాబిన్ ఊతప్ప.. జియో హాట్‌స్టార్ లైవ్‌లో అంపైర్ల తీరును తప్పుబట్టాడు. 'అంపైర్ల నిర్ణయం నాకు ఆశ్చర్యానికి కలిగించింది. రాత్రిపూట పొగమంచు మరింత తీవ్రమవుతుంటే.. సమయం గడిచేకొద్దీ పరిస్థితి మెరుగుపడుతుందని వారు ఎలా అనుకుంటున్నారు? మనం మరో అరగంట వేచి ఉంటే ఏం జరుగుతుంది. పరిస్థితి మరింత కఠినంగా మారుతుంది. నేను ఇంతకంటే దారుణమైన పొగమంచు మధ్య ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాను. కానీ అంపైర్లు ఆటను ప్రారంభించకుండా సమయాన్ని వృథా చేయడం కోపం తెప్పిస్తుంది.'అని రాబిన్ ఊతప్ప తెలిపాడు. అంపైర్ల తీరు తనకు కూడా అర్థం కావడం లేదని సౌతాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్ అన్నాడు. 'అంపైర్లు ఏ నియమాన్ని పాటిస్తున్నారో నాకు తెలియదు. ఒక ఆటగాడిగా.. ఈ వాతావరణంలో ఆడటం పెద్ద కష్టమేం కాదనిపిస్తోంది. అంపైర్లలో ఒకరు వచ్చి మ్యాచ్ ఆలస్యానికి గల కారణాన్ని వివరిస్తే బాగుంటుంది.'అని డేల్ స్టెయిన్ అభిప్రాయపడ్డాడు. పొగమంచుతో పాటు మైదానం గాలి నాణ్యత దారుణంగా పడిపోవడంతో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మాస్క్ ధరించి కనిపించాడు. పొగమంచు కురిసే ప్రదేశాల్లో మ్యాచ్‌లు ఎందుకని, సౌత్ ఇండియాలో చాలా మైదానాలు అనుకూలంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మనోళ్లకీ తీరిక ఎక్కడ ఉంది?
ప్రపంచవ్యాప్తంగా ఎన్ని క్రికెట్ లీగులు ఉన్నా.. ఐపీఎల్‌కు ఉన్న క్రేజే వేరు. అలాగే భారత క్రికెటర్లు రిటైర్ అయితే తప్ప విదేశీ లీగుల్లో ఆడటానికి వీల్లేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ లాంటి స్టార్ ప్లేయర్లు కేవలం ఐపీఎల్‌లోనే ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడగలరు. దీనిపై ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్ మాట్లాడారు. సమీప భవిష్యత్తులో టీమిండియా క్రికెటర్లు విదేశీ లీగుల్లో ఆడే అవకాశం లేదని తేల్చిచెప్పారు. దీనికి వర్క్‌లోడ్ మేనేజ్‌మెంటే కారణమని ఆయన వివరించారు. ‘మన క్రికెటర్లకు ఉన్న వర్క్‌లోడ్‌ను ఒక్కసారి గమనించండి. టీమిండియా ఆటగాళ్లు కచ్చితంగా దేశవాళీల్లో ఆడాలన్న బీసీసీఐ నియమం ఉంది. అందుకే వారు విజయ్ హజారే ట్రోఫీ ఆడాల్సి ఉంది. అలాగే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కూడా. ఇలా భారత్‌లోనే ఆడటానికి చాలా క్రికెట్ ఉంది. ఇక్కడే చాలామంది అభిమానులూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికి విదేశీ లీగుల్లో ఆడేందుకు అవకాశం ఉంటుందని నేను అనుకోను’ అని అరుణ్ సింగ్ ధుమాల్ అన్నారు. ‘ప్రస్తుతం పెద్ద ప్లేయర్లు విదేశీ లీగుల్లో ఆడలేరు. వారికి అసలు ఎలా వీలవుతుంది? చాలామంది క్రికెటర్లు మూడు ఫార్మాట్లలో ఆడుతున్నారు. వారికి తీరిక ఎక్కడ ఉంది? కొంతమంది బౌలర్లకు రెండు టెస్ట్‌ల తర్వాత విశ్రాంతి ఇస్తున్నాం. అలాగే టీ20లు, వన్డేల నుంచి విరామం ఇస్తున్నాం.