ఆర్టికల్ 370 రద్దుతోపాటు కశ్మీర్ విభజనపై ఓ వైపు పాకిస్తాన్ విషాన్ని చిమ్ముతుంటే.. ఇదే అదునుగా ఉగ్రమూకలు కూడా దేశంపై విరుచుకుపడేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది.. కశ్మీర్ లోయతో పాటు పలు రాష్ట్రాల్లో బాంబు దాడులకు పాల్పడేందుకు పాకిస్తాన్‌కు చెందిన ISI వ్యూహాలు రచిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ విభాగం పేర్కొంది. పుల్వామా ఉగ్రదాడికి పాల్పడిన జైషే మహ్మద్ సభ్యులే ఈదాడులకు సూత్రధారులుగా వ్యవహరించనున్నారని నిఘా వర్గాలు వెల్లడించాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా రాజస్తాన్, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఇంటలెజిన్స్ వర్గాలు హెచ్చరించాయి.
స్వాత్రంత్ర్య దినోత్సవం సందర్భంగా విమానాశ్రయాలు లక్ష్యంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్రం ఆయా రాష్ట్రాలను కోరింది. అవాంఛనీయ ఘటనలను నిరోధించేందుకు భద్రతను ముమ్మరం చేయాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ సెక్యూరిటీ అడ్వైజరీని జారీ చేసింది.
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనూ ఈనెల 20 వరకు హై అలర్ట్ ప్రకటించారు. వాహనాలను తనిఖీలు చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. విజిటర్స్ ఎంట్రీ పాసులపై ఆంక్షలు విధించారు.. ఈ నెల 10 నుంచి 20 వరకు టికెట్లు తీసుకున్న ప్రయాణికులు తప్ప సందర్శకులెవరినీ విమానాశ్రయాల్లోకి అనుమతించరు. ఎయిర్‌పోర్టులతోపాటు.. రైల్వేస్టేషన్, హైవే, ఔటర్‌రింగ్ రోడ్డు, ఇతర రద్దీ ప్రదేశాల్లో సీఐఎస్‌ఎఫ్, ఆక్టోపస్, రాష్ట్ర పోలీస్, డాగ్, బాంబ్ స్కాడ్ సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు. పోలీస్ అధికారుల పర్యవేక్షణలో భద్రతాచర్యలు చేపట్టారు.