గోదారమ్మ పరవళ్లు.. నీట మునిగిన పంటలు

Update: 2019-08-10 01:34 GMT

వర్షాలకు తెలంగాణలో గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఇక భద్రాచలం వద్దనైతే ఉగ్రరూపం దాల్చింది.. వరద మట్టం 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. తాలిపేరు గేట్లు తెరిచి నీరు విడుదల చేయడంతో దుమ్ముగూడెం,భద్రాచలం,బూర్గంపాడు మండలాల్లో కొన్ని చోట్ల నీరు రోడ్ల మీదికి చేరింది.

Full View

ములుగు జిల్లాలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కర ఘాట్‌ వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. రాంనగర్‌ లోలెవెల్‌ బ్రిడ్జి వద్ద జీడీ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.. దీంతో రాంనగర్‌, లంబాడీ తండా, కోయిగూడా, ఎల్లపూర్‌ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పంటపొలాలు కూడా నీట మునిగాయి.

కృష్ణా నదికి కూడా వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. సుమారు 4 లక్షల 45 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జూరాల పూర్తి స్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, 8.929 టీఎంసీలను నిల్వ చేసి, 4 లక్షల 44 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. జూరాల బ్యాక్ వాటర్ నుంచి బీమా నెట్టెంపాడు, కోయిల్‌ సాగర్, రిజర్వాయర్లతో పాటు కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని రైతులకు విడుదల చేస్తున్నారు. అయితే ఎగువ ప్రాంతమైన అల్మట్టి, నారాయణపూర్ నుంచి భారీగా నీరు వస్తుండడంతో జూరాలకు దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్‌ ప్రాజెక్ట్‌ల్లో నీరు చేరుకుంటోంది. దీంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది.

Similar News