ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ నిండుకుండలా మారుతోంది. ప్రస్తుతం దాదాపు 9 లక్షల 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండడంతో.. వేగంగా నీటమట్టం పెరుగుతోంది. దీంతో.. 6 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఈ నీరంతా పులిచింతలకు చేరనుంది. తుంగభద్ర నుంచి 2 లక్షల కుసెక్కుల, ఆల్మట్టి నుంచి 6 లక్షల కుసెక్కులతోపాటు.. నదీపరీవాహక ప్రాంతంలో వర్షాల ప్రభావంతో శ్రీశైలంకి చేరుతున్న వరదంతా నేరుగా సాగర్‌కే చేరుతోంది. ఈ ప్రభావంతో రోజూ ప్రాజెక్టులోకి 55 టీఎంసీల నీరు చేరుతోంది. పదిరోజుల కిందటి వరకూ సరైన వర్షాల్లేక.. ప్రాజెక్టులు ఎండిపోయి.. భవిష్యత్‌పై ఆందోళనలు నెలకొన్న సమయంలో కురిసిన వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు ఒక్కసారిగా జీవం పోశాయి. ఎగువ నుంచి వరద ప్రవాహం మరో 4 రోజుల వరకూ కొనసాగే అవకాశం ఉండడంతో ప్రాజెక్టులన్నీ పూర్తిగా జలకళ సంతరించుకుంటున్నాయి.
నాగార్జున సాగర్ జలాశయం నుంచి 12, 13, 14, 15,16, 17 గేట్లను ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. సాయంత్రానికల్లా మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం 30వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. పంటకాల్వలకు వదులుతున్న నీటితో కలిపితే 70వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. గంటకు అడుగున్నర చొప్పున ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతుండడంతో పరిస్థితని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నీటి విడుదలపై నిర్ణయం తీసుకోనున్నారు అధికారులు.
ప్రస్తుతం నాగార్జున సాగర్ 6 గేట్లను ఎత్తి దిగువకు నీళ్లు వదిలారు. ఐదు గేట్లు సీఈ నరసింహారావు మరో గేటును ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఎత్తి నీళ్లు విడుదల చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 560 అడుగులు దాటింది. పూర్తి నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం సాగర్‌లో 229 టీఎంసీలు నీరు చేరింది. ఇదే ప్రవాహం కొనసాగితే వచ్చే వరదతో రెండ్రోజుల్లో సాగర్ పూర్తిగా నిండే అవకాశం ఉంది. ప్రధాన డ్యామ్‌ద్వారా నీటి విడుదలతోపాటు కుడి, ఎడమ కాల్వలు, పవర్ జనరేషన్ ద్వారా 40వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. దీంతో ఆయకట్టు రైతుల్లో సంతోషం నెలకొంది.