జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఆంక్షలు విధించారు. గురువారం రాత్రి పలు చోట్ల పోస్టర్లు వెలిశాయి. ఆర్టికల్-370 రద్దుకు వ్యతిరేకంగా వేర్పాటువాద సంస్థలు నిరసనలకు పిలుపు నిచ్చాయి. దాంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఎక్కడి కక్కడ బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదని ప్రకటించారు. ప్రజలు గుంపులు గుంపులుగా తిరగొద్దని సూచించారు.
ఆర్టికల్-370 రద్దు నేపథ్యంలో ఆగస్టు 5న జమ్మూకశ్మీర్‌లో ఆంక్షలు విధించారు. 2వారాల తర్వాత నిషేధాజ్ఞలు సడలించారు. పరిస్థితులు క్రమంగా మెరుగుపడడంతో ఆంక్ష లను కొద్దిగా కొద్దిగా తొలగించారు. చాలా ప్రాంతాల్లో స్కూళ్లు, ఆఫీసులు ప్రారంభమయ్యాయి. ప్రజలు కూడా క్రమంగా తమ దైనందిన కార్యకలాపాల్లో మునిగిపోతున్నారు. ఐతే, వేర్పాటువాదులకు మాత్రం కేంద్రనిర్ణయం రుచించలేదు. దాంతో ఆందోళనలకు పిలుపునిచ్చారు. వేర్పాటువాదులు నిరసన ప్రదర్శనలకు పిలుపునివ్వడంతో మళ్లీ ఆంక్షలు విధించారు.