టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధంకండి అన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడి మాటలను ఆచరణలో చేసి చూపెడుతోంది తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ. ఇంత కాలం సభ్యత్వ నమోదు కార్యక్రమంపై దృష్టి సారించిన ఆ పార్టీ... ఇక రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలే టార్గెట్‌గా దూకుడు పెంచుతోంది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో జరుగుతున్న అక్రమాలపై పూర్తి వివరాలను సేకరిస్తోన్న బీజేపీ.. రోజుకో అంశం మీద ప్రభుత్వంపై మాటల యుద్ధానికి తెరతీస్తోంది. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్రపతి, కేంద్ర హోం శాఖలు పూర్తి వివరాలు తమకు అందజేయాల్సిందిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖ పంపాయి. సభ్యత్వంపై కేటీఆర్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధమే జరిగింది. విద్యుత్ కొనుగొలు ఒప్పందాల పైనా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఇందుకు విద్యుత్ సంస్థల సీఎండీ స్పందించి ఏ విచారణకైనా సిద్ధం అంటూ ప్రకటించాల్సి వచ్చింది. దీంతో విద్యుత్ విషయంలో ఆరోపణలకు మరింత పదును పెంచిన లక్ష్మణ్.. ప్రభాకర్ రావు సవాల్‌కు తాము సిద్ధంగా ఉన్నాం అంటూ ప్రకటించారు. విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ముఖ్యమంత్రే విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు. లేదంటే తామే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి సీబీఐ విచారణ జరిపించాలని కోరుతామని అన్నారు.
ఇక తెలంగాణ అత్యధిక ఆదాయం వచ్చే మరో రంగం మైనింగ్. ఏటా వందల కోట్ల రూపాయాల ఆదాయం ప్రభుత్వానికి మైనింగ్ శాఖ నుండి సమకూరుతోంది. అయితే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే వ్యాపారులు, అధికార పార్టీ నాయకుల జేబుల్లోకి వెళ్లే ఆదాయమే ఎక్కువంటోంది బీజేపీ. కరీంనగర్‌తో పాటు ఉత్తర తెలంగాణలో విస్తరించి ఉన్న గ్రానైట్ మైనింగ్‌లో పన్నులు ఎగవేస్తూ... అక్రమంగా మైనింగ్ చేయడమే కాకుండా.. గుట్టుచప్పుడు కాకుండా వేల కోట్ల విలువైన గ్రానైట్‌ను విదేశాలకు తరలిస్తున్నారని ఆరోపించారు ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్. గ్రానైట్ అక్రమాల్లో ఓ మంత్రి హస్తం ఉందని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు.. మైనింగ్ అక్రమాలు వెలుగులోకి రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా విచారణ చేసి దోషులను శిక్షించాలని.. లేదంటే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షానే ఇప్పుడు కేంద్ర హోం మంత్రిగా ఉన్నారు. ప్రభుత్వంపై చేస్తున్న పోరాటానికి అండగా ఉంటానని ఆయనే రాష్ట్ర బీజేపీ నేతలకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై సీబీఐ విచారణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? లేక కేవలం టీఆర్ఎస్‌ను తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ఇలాంటి హెచ్చరికలు చేస్తోందా అన్నది చూడాలి.