తమిళనాడులో చొరబడిన ఉగ్రవాదులు!

Update: 2019-08-29 09:50 GMT

తమిళనాడులో ఉగ్రవాదులు చొరబడ్డారన్న నిఘావర్గాల సమాచారంతో.. కోయంబత్తూర్‌లో విస్తృతంగా సోదాలు నిర్వహించింది జాతీయదర్యాప్తు సంస్థ. దీంతో పాటు మరో ఐదు ప్రాంతాల్లోనూ తనిఖీలు చేపట్టింది. రైల్వే స్టేషన్లు, బస్‌ స్టేషన్‌లతో పాటు పలు మాల్స్‌లో సోదాలు నిర్వహించారు ఎన్‌ఐఏ అధికారులు. వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. అనుమానం వచ్చిన వ్యక్తుల్ని అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

కోయంబత్తూరులో పట్టుబడిన అజరుద్దీన్‌ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ తనిఖీలు చేస్తున్నారు ఎన్‌ఐఏ అధికారులు. శ్రీలంక ద్వారా సముద్ర మార్గంలో ఉగ్రవాదులు చొరబడినట్లు ఎన్‌ఐఏకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. కొలంబో దాడుల అనంతరం.. ఇప్పటికే తూర్పు తీర రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఇవాళ తెల్లవారుజాము నుంచి ఎన్‌ఐఏ సోదాలు చేస్తోంది.

అనుమానితుల నుంచి ఎన్‌ఐఏ అధికారులు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌, సిమ్‌కార్డులు, పెన్‌డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు. అటు.. ఏపీలోని నెల్లూరు జిల్లాలోనూ పలు చోట్ల పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు.

 

Similar News