Taj Mahal: ఆగ్రాలో తాజ్ మహాల్ మాయం ..
దట్టమైన పొగమంచు కారణంగా కనిపించని తాజ్ మహాల్
ఆగ్రాలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రేమ చిహ్నం తాజ్ మహల్ ఒక్కసారిగా మాయమైందన్న వార్త కలకలం రేపింది. తాజ్ మహల్‌ను చూడటానికి వచ్చిన పర్యాటకులు అక్కడికి చేరుకున్న వెంటనే అది కనిపించకపోవడంతో తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. కొంతసేపు అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొనగా, తాజ్ మహల్ నిజంగా మాయమవలేదని అధికారులు స్పష్టం చేశారు. దట్టమైన పొగమంచు వాతావరణ పరిస్థితుల కారణంగా తాజ్ మహల్ పూర్తిగా కనబడకపోయిందని తెలిపారు. కొద్దిసేపటి తర్వాత పొగమంచు తగ్గడంతో తాజ్ మహల్ మళ్లీ స్పష్టంగా దర్శనమిచ్చింది.
ఉత్తర భారతాన్ని ప్రస్తుతం తీవ్రమైన చలి కమ్మేసింది. చలితో పాటు దట్టమైన పొగమంచు అనేక నగరాలను ఆవరిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఆగ్రా, చండీగఢ్, హర్యానా రాష్ట్రాలు పొగమంచు ముప్పును ఎదుర్కొంటున్నాయి. గత నాలుగు రోజులుగా ఆగ్రా నగరాన్ని దట్టమైన పొగమంచు దుప్పటి కప్పేసింది. ఉదయం 10 గంటల తర్వాత కూడా 10 మీటర్ల దూరంలో ఉన్నవారు కనిపించనంత తీవ్రంగా పొగమంచు పేరుకుపోయింది. ఈ కారణంగా ఉదయపు వేళ తాజ్ మహల్ పూర్తిగా కనబడకుండా పోయింది.
వాతావరణ నిపుణుల ప్రకారం, తీవ్ర చలి ప్రభావంతో పాటు అధిక వాయు కాలుష్యం కూడా ఇలాంటి దట్టమైన పొగమంచు ఏర్పడటానికి కారణమవుతోంది. తాజ్ మహల్ కనిపించని దృశ్యాలను పర్యాటకులు వీడియోలు, ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఘటన వైరల్‌గా మారింది.