నాకు ముందు నుంచే ఆస్తులు ఉన్నాయి : మంత్రి ఈటల

Update: 2019-08-30 01:40 GMT

క్యాబినెట్‌ విస్తరణ పేరుతో జరుగుతున్న ప్రచారం టీఆర్‌ఎస్‌లో రాజకీయ వేడి పుట్టిస్తోంది. కేసీఆర్‌ క్యాబినెట్‌లో బెర్తులు, ఎర్తులపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో మంత్రి ఈటల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చిన వార్తల పట్ల కలత చెందిన రాజేందర్‌ గురువారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లోని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉద్వేగానికి లోనయ్యారు. అదంతా చిల్లర ప్రచారమంటూ కొట్టిపారేశారు. అలాంటి చిల్లర ప్రచారానికి సమాధానం చెప్పాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. పదిహేనేళ్లలో ఏ ఒక్కరి నుంచైనా ఐదు వేలు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలగుతానని చెప్పారు. తనకు వ్యతిరేకంగా రాజకీయ కుట్ర జరుగుతోందని.. సమయం వచ్చినప్పుడు ఆధారాలు బయటపెడతానన్నారు.

మంత్రి పదవి భిక్ష కాదని.. తనకు మంత్రి పదవి బీసీ కోటా చూసి ఇవ్వలేదన్నారు ఈటెల రాజేందర్‌. పార్టీ కోసం పోరాడిన చరిత్ర తనదని... ఎవరి సహకారం లేకుండా రాజకీయాల్లోకి వచ్చి.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని తానని ఆయన అన్నారు.

టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం కన్నా ముందు నుంచి ఉద్యమంలో ఉన్నానని... గులాబీ జెండా ఓనర్లలో ఒకరినని ఈటల అన్నారు. ప్రజలే చరిత్ర నిర్మాతలని, నాయకులు కాదని గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దగ్గరికి వెళ్లి ఆస్తులు కూడబెట్టుకున్నానంటూ ప్రేలాపనలు చేస్తున్నారని.. ఈ ఆస్తులు తనకు ముందు నుంచే ఉన్నాయని.. ఎవరి దయా దాక్షిణ్యాలతో తనకు రాలేదని ఈటల స్పష్టం చేశారు. అధికారం శాశ్వతం కాదు.. ధర్మం, న్యాయం మాత్రమే శాశ్వతమని అన్నారు.

ఐతే.. హూజూరాబాద్‌లో తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు మంత్రి ఈటల. తనపై వస్తున్న తప్పుడు వార్తలపై మాత్రమే తాను స్పందించాని.. నిరాధారమైన వార్తలు రాయొద్దని చెప్పానన్నారు. సోషల్‌ మీడియా సంయమనంతో ఉండాలని కోరారు. తమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆరేనని... గతంలో వ్యాపారవేత్తగా ఉన్న తనను కమలాపూర్‌ నుంచి పోటీ చేయించి గెలిపించింది కేసీఆరే అని చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిచేది గులాబీ జెండానే అని ఈటల స్పష్టం చేశారు. తాను పార్టీలో చేరిన నాటి నుంచి.. నేటి వరకు గులాబీ సైనికుడినే అని ఈటల తేల్చిచెప్పారు.

Full View

Similar News