ఎమ్మెల్యే హరీష్‌రావు పిలుపుకు అద్భుత స్పందన

Update: 2019-09-01 15:38 GMT

వినాయక చవితి వస్తోందంటే ఆ సందడి అంతా ఇంతా కాదు. గల్లీకో గణేషుడు, వాడవాడలా సంబరాలు, ఊరంతా ఉత్సవాలు. అయితే పైకి పండగ వాతావరణం కనిపిస్తున్నా ఎవరికివారే అన్నట్టు సాగుతుంటాయి గణేషుడి పూజలు. ప్రతీ ఒక్కరూ తామే గొప్పగా చేస్తున్నామని గల్లీకో మండపాన్ని ఏర్పాటు చేస్తుంటారు. ఈ విషయాన్ని గమనించిన మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే, హరీష్‌రావు ఒక ఊరు ఒకే వినాయకుడు నినాదాన్ని తెరపైకి తెచ్చారు.

ఎమ్మెల్యే హరీష్‌రావు ఇచ్చిన పిలుపుతో సిద్ధిపేట నియోజకవర్గంలోని మిట్టపల్లి గ్రామం ముందుగా స్పందించింది. ఒకే వినాయక విగ్రహం కాన్సెప్ట్‌కు జై కొట్టింది. మట్టి గణపతే మహాగణపతి అంటూ ఊరంతా ముక్తకంఠంతో ఆమోదం తెలిపింది. గల్లీకో సంబరం కాకుండా ఊరంతా ఒకే చోట పండగ చేసుకోవాలని మిట్టపల్లి వాసులు తీర్మానించారు. ఒక ఊరు ఒకే విగ్రహం నినాదంతో పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరగనుంది. POP విగ్రహాలు తగ్గడం వల్ల గ్రామంలోని చెరువులు కూడా సురక్షితంగా ఉంటాయంటున్నారు గ్రామస్తులు. మిట్టపల్లిని చుట్టుపక్కల గ్రామాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయి. గ్రామసభలు నిర్వహించి ఒక ఊరు- ఒకే వినాయకుడు నినాదాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ఒకే వినాయకుడి విగ్రహంతో ప్రజల మధ్య సంభందాలు మెరుగుపడతాయంటున్నారు గ్రామస్తులు.

Similar News