ఆరెంజ్ అలర్ట్‌.. మరో రెండు రోజులు భారీ వర్షాలు

Update: 2019-09-04 14:41 GMT

ముంబై మళ్లీ మునిగింది. కొన్ని రోజుల పాటు గ్యాప్ ఇచ్చిన వరుణుడు మళ్లీ తన ప్రతాపం చూపిస్తున్నాడు. ముంబై, థానే, నవీ ముంబైలలో భారీ వర్షం కురిసింది. కుండపోత వానలతో ముంబైలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. సియాన్ రోడ్డు, గాంధీ మార్కెట్, మిలాన్ సబ్ వే, కుర్లా డిపో, అన్ టాప్ హిల్ సెక్టార్‌ ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. రోడ్లపై వరదనీరు పారుతుండటంతో 38 రూట్లలో సిటీబస్సులనుదారి మళ్లించారు.

భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థమైంది. థానే, నవీ ముంబై ప్రాంతాల్లో రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయాయి. రోడ్లపై నడుము లోతు వరకు నీరు చేరడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో వివిధ పనులు, కార్యాలయాలకు వెళ్లే వారు ఇబ్బంది పడ్డారు. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ముంబైలోని తులసీ, తాన్సా, సాగర్, విహార్ సరస్సులు వరదనీటితో నిండిపోయాయి. ముంబై రైల్వే ట్రాక్‌లపై భారీగా నీరుచేరడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కుండపోత వానల కారణంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

మరో రెండు రోజుల పాటు ముంబై, పుణె నగరాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ అధికారులు సూచించారు. పాల్ఘర్, రాయిగడ్, రత్నగిరి, సింధుధుర్గ్ ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది వాతావరణ శాఖ.

Similar News