TS RTC కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో 165 కొత్త బస్సులను నడపాలని నిర్ణయించింది. నగరంలో పెరిగిపోతున్న కాలుష్యంపై దృష్టి పెట్టిన ఆర్టీసీ 15 సంవత్సరాల పైబడిన బస్సులను పూర్తిగా తొలగించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదన మూడేళ్ల క్రితం చేసినా.. తాజాగా ఆ నిర్ణయానికి ఆమోదం లభించింది . పాత వాహనాలలో ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నట్లు గుర్తించింది. వాటిని మార్చి ఆ స్థానంలో కొత్త బస్సులను నడపనుంది.
పాత బస్సులను నడపటానికి అయే ఖర్చు ఎక్కువగా ఉండటం.. రిపేరింగ్ సమయంలో వాటికి తరచూ కొత్త స్పేర్ పార్ట్స్ వేయాల్సివస్తోంది. దీంతో వాటి నిర్వహణ ఖర్చు భారీగా పెరుగుతోందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీ నష్టాలలో ఉన్నప్పటికీ ఈ కీలక నిర్ణయం తీసుకుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. కొత్త బస్సులు కొనగోలుకు 44కోట్లు ఖర్చు అవుతున్నట్లుగా వెల్లడించారు. పాత బస్సులు తరుచూ రోడ్లపై నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. మార్గం మధ్యలో ఎక్కడ పడితే అక్కడ బస్సులు ఆగిపోతుండడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో భారమే అయినా..ప్రయాణికుల సౌకర్యార్థం పాత బస్సులను తీసివేసి కొత్త బస్సులను నడపాలనుకుంటున్నామని ఓ అధికారి తెలిపారు.