తూర్పుగోదావరి జిల్లాలో లాంచీ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బోటు బోల్తా పడటంతో పర్యాటకులు గల్లంతయ్యారు. దేవీ పట్నం మండలం కచ్చలూరు వద్ద ఇప్పటి వరకు 8 మృతదేహాలను వెలికితీశారు. మరో 27మంది ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం జరినప్పుడు లాంచీలో మొత్తం 73 మంది ఉన్నట్లు తెలుస్తోంది. మరో 25 మంది ఆచూకి కోసం గాలిస్తున్నారు. అయితే రాత్రి కావడంతో ప్రస్తుతం గాలింపు చర్యలు నిలిపేశారు. సోమవారం ఉదయంనుంచి మళ్లీ గాలింపు చర్యలు చేపట్టనున్నారు. సహాయక చర్యల్లో 2ఎన్డీఆరఎప్, ఎస్డీఆర్‌ఎఫ్, 2 హెలికాఫ్టర్లను, బోట్లు, గజ ఈతగాళ్లను రంగంలో దింపారు. మరోవైపు సోమవారం ఉత్తరాఖండ్ నుంచి ప్రత్యేక బృందాలు కానున్నారు. సైడ్ స్కాన్ సోనార్‌తో మృతదేహాలను గుర్తించనున్నారు.
సరిగ్గా మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. పర్యాటకులంతా .. భోజనం చేసేందుకు ఒక్కసారిగా బోటుకు ఒకే వైపునకు వచ్చారు. దీంతో బోటు ఒరిగిపోయింది. బోటు పూర్తిగా మునిగిపోవడంతో.... దాదాపు 40 మంది వరకు గల్లంతయ్యారు. కేవలం లైఫ్‌జాకెట్ వేసుకున్నవారినే రక్షించగలిగారు. ఈదుర్ఘటనలో తెలంగాణకు చెందినవారే ఎక్కువ. హైదరాబాద్‌కు చెందినవారు 22 మంది కాగా, వరంగల్ వాళ్లు 14 మంది ఉన్నారు. వీరితో పాటు అనకాపల్లి, విజయవాడ, విశాఖకు చెందిన వారు ఉన్నారు.