కడప, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు..

Update: 2019-09-19 12:44 GMT

కడప జిల్లాలో గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కుందూ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సమీప గ్రామాల ప్రజలు కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు. నిన్న సాయంత్రం నుంచి 35 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండగా ప్రస్తుతం 25 వేల క్యూసెక్కులుగా ఉంది. అయినప్పటికీ పెద్దముడియం మండలంలోని నెమళ్లదిన్నె, బలపనగూడూరు, చిన్నముడియం, ఉప్పాలురు, గ్రామాల చుట్టూ కుందూ నది ప్రవాహం ఎక్కువగా ఉంది.

కుందూ నదీ పరివాహక ప్రాంతాల్లో వరదనీరు చేరడంతో ఇళ్లు నీటమునుగుతున్నాయి. పలు మండలాల్లో వేలాది ఎకరాలు నీటి మునిగాయి. చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. తగ్గుముఖం పట్టిందనుకున్న వర్షం మళ్లీ మొదలవడంతో ఆయా గ్రామాల్లోని ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

జమ్మలమడుగు నుంచి ఆళ్లగడ్డ, చాగలమర్రి, కోవెలకుంట్ల వంటి ముఖ్యప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్తున్నారు. కానీ ప్రజలు మాత్రం ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నామని, వరదనీరు ఆందోళన కలిగిస్తోందంటున్నారు.

అటు ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోనూ గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గిద్దలూరు పట్టణం నుంచి వెళ్లే సగిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతంలో ఉన్న నివాస గృహాల్లోకి నీరు చేరుతోంది. వరదలకు చాలా చోట్ల పొలాలు నీట మునిగాయి.

Similar News