పుస్తకంలో అన్యమత ప్రస్తావన కలకలం

Update: 2019-09-24 05:59 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్‌సైట్‌లో ఉన్న భక్తిగీతామృత లహరి అనే హైందవ పుస్తకంలో అన్యమత ప్రస్తావన కలకలం రేపుతోంది. విషయం తెలుసుకున్న TTD అధికారులు ఉలిక్కిపడ్డారు. ఈవో అప్రమత్తమై పుస్తకాన్ని తొలగించారు. రచయిత రాసే పుస్తకం పూర్తిగా హైందవ వ్యవస్థకు సంబంధించి ఉండాలనేది TTD నిబంధన. అయితే.. చెన్నైకి చెందిన సీతారామయ్య అనే రచయిత భక్తిగీతామృత లహరిని రచించారు. ఈ పుస్తకాన్ని TTD వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈ పుస్తకంలో అన్యమత ప్రస్తావన వున్న విషయం నిన్న వెలుగుచూసింది. ఇందులో 182, 183, 184 పేజీలలో ఏసు క్రీస్తుకు సంబంధించిన ప్రస్తావన ఉండటాన్ని గమనించి వెబ్‌సైట్ నుంచి ఆ పుస్తకాన్ని తొలగించారు.

TTD భక్తిగీతామృత లహరి పుస్తకంలో అన్యమత సమాచారం ఉందన్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌. ఆన్‌లైన్‌లో భక్తిగీతామృత లహరి అప్‌లోడ్‌ చేసిన సమయంలో మూడు పేజీలలో అన్యమత సమాచారం గుర్తించామన్నారు. వెంటనే ఆ సమాచారాన్ని తొలగించామని చెప్పారు. ఆ పుస్తకాన్ని ప్రైవేట్‌ వ్యక్తులు ముద్రించారని పేర్కొన్నారు. పుస్తక ముద్రణకు TTD ఆర్థిక సహాయం మాత్రమే చేస్తుందని స్పష్టం చేశారు. అన్యమత సమాచారంపై విచారణ జరుగుతుందని వెల్లడించారు.

Similar News