ycp Government : జగన్ జమానాలో ఆశా కార్యకర్తలకు తప్పని నిరాశ
పని చేయించుకొని ప్రతిఫలం దాటేశారు;
ప్రజారోగ్యంలో కీలకంగా వ్యవహరించే ఆశా కార్యకర్తలకు సీఎం జగన్ చుక్కలు చూపించారు. పని భారాన్ని పెంచి, వారితో వెట్టిచాకిరీ చేయించారు. తాత్కాలిక పద్ధతిలో పనిచేసే వీరికి సంక్షేమ పథకాలను దూరం చేశారు. దశాబ్దాల శ్రమ అనంతరం ఉద్యోగ విరమణ చేసిన వారికి అదనంగా ఒక్క రూపాయి ఇస్తే ఒట్టు. అరకొర జీతం ఇవ్వడమే కాదు. సంక్షేమ పథకాలనూ దూరం చేసింది.
గ్రామాల్లో గర్భిణులు, బాలింతలు, శిశువుల సంరక్షణ కోసం జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో 2006లో ఆశాలను నియమించారు. వీరు రాష్ట్రవ్యాప్తంగా 43 వేల మంది ఉన్నారు. వేతనం పెంచామన్న ధోరణితో వైకాపా ప్రభుత్వం వీరిని రాచిరంపాన పెట్టింది.. టీకాలు వేయించడం, ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పులు అయ్యేలా చూడటం, అత్యవసర సమయాల్లో గర్భిణులను ఆసుపత్రులకు తరలించడం వంటి బాధ్యతలు అప్పగించింది. మధుమేహం, రక్తపోటు బాధితులకు నెలనెలా మాత్రలను అందించే విధులనూ నిర్వర్తించాలంది. జగనన్న ఆరోగ్య సురక్ష కింద మూడు, నాలుగుసార్లు ఆశాలను గ్రామాల్లోని ఇంటింటికీ పంపించింది. జగన్ రాజకీయ ప్రచారం కోసం, ఆయన వ్యక్తిగత ప్రాభవం పెంచుకునేందుకు సర్వేల పేర్లతో ఇంటింటికీ తిప్పింది.
ఆశా కార్యకర్తలకు కొద్దికాలం కిందట వైద్యారోగ్య శాఖ అధికారులు డొక్కు సెల్‌ఫోన్‌లను ఇచ్చారు. వాటిలో వాడటానికి 2జీ సిమ్స్ అందచేసి, 14 రకాల యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆదేశించారు. ఆశా కార్యకర్తలు ఉదయమే యాప్‌లో లాగిన్ అవ్వాలని, సాయంత్రం ఆరు గంటలకు లాగ్ అవుట్ కావాలని సూచిస్తున్నారు. గ్రామాల్లో నెట్‌వర్క్ సమస్య కారణంగా ఫోన్లు పనిచేయకపోయినా ఆశా కార్యకర్తలనే బాధ్యులను చేస్తున్నారు. ప్రభుత్వ ఫోన్ పనిచేయకుంటే సొంత ఫోన్ ద్వారా వివరాలను నమోదు చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. కొందరు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయడం తెలియక... సాయం చేసిన వారికి సొంత డబ్బు నుంచి 2 వేల వరకు చెల్లిస్తున్నారు. ఆశాలు ఈ ఆన్‌లైన్ పనితోపాటు 26 రకాల రికార్డులనూ నిర్వహించాల్సి వస్తోంది. వీటిని కొనడానికీ మరో 2 వేలను సొంతంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.తాము సూచించిన క్షేత్రస్థాయి సమాచారాన్ని మొబైల్ యాప్‌లలో ఆఘమేఘాల మీద నమోదు చేయాలని వైద్యారోగ్య శాఖ ఒత్తిడి తెస్తోంది. దీంతో ఆశాలు ఇతరులపై ఆధారపడుతున్నారు. జూమ్ ద్వారా ఇచ్చే శిక్షణ ఉపయోగపడటం లేదని, ప్రత్యక్ష విధానంలో తర్ఫీదు ఇవ్వాలని అడుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించడం లేదని ఆశాలు వాపోతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచిన సర్కారు... ఆశాలకు మాత్రం 60గానే ఉంచింది. ఖాళీ అవుతున్న పోస్టులకు అనుగుణంగా కాకుండా సగం మాత్రమే భర్తీ చేస్తోంది. తీవ్ర ఒత్తిడి కారణంగానే గుంటూరు జిల్లా తాడేపల్లిలో 2023 అక్టోబరులో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహిస్తుండగానే కుప్పమ్మ అనే ఆశా కార్యకర్త కుప్పకూలి, ప్రాణాలు విడిచారని సహచర ఆశాలు వాపోయారు. వైకాపా నేతల వేధింపుల కారణంగానే ఉమ్మడి అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు ఆశాలు గతంలో ఆత్మహత్యకు ప్రయత్నించారు.