వేణుమాధవ్ అంత్యక్రియలకు రెండు లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించిన మంత్రి

Update: 2019-09-26 05:52 GMT

నవ్వులతో ప్రేక్షకలోకాన్ని ఉర్రూతలూగించిన హాస్య నటుడు వేణుమాధవ్‌. అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. కామెడీతో ప్రేక్షకులను మెప్పించిన వేణుమాధవ్..తన కలుపుగోలు తనంతో ఇండస్ట్రీలో అందరికీ ఆప్తుడయ్యాడు. వరుసలు పెట్టి పలకరిస్తూ ఇంటిమనిషిగా మారిపోయాడు. ఇప్పుడా నవ్వులు లేవు. కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న వేణుమాధవ్ కు కిడ్నీ సమస్య కూడా తోడవటంతో ఆరోగ్యం విషమించింది. సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

వేణుమాధవ్ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు, చిరంజీవి,పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు ప్రగాడ సానుభూతి తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ వేణుమాధవ్ ఆస్పత్రి బిల్లులను కట్టడంతోపాటు అంత్యక్రియలకు రెండు లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. వేణుమాధవ్ చిన్న వయసులోనే మరణించడం చాలా బాధ కలిగించిందన్నారు..

వేణుమాధవ్ మరణవార్త తెలుసుకున్న శివాజీరాజా, అలీ, ఉత్తేజ్, జీవిత రాజశేఖర్ ఆయనకు నివాళులర్పించారు. వేణుమాధవ్ భౌతికకాయాన్ని యశోద ఆసుపత్రి నుంచి నిన్ననే తన స్వగృహానికి తరలించారు. హైదరాబాద్ లోని కాప్రా పరిధి మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఆయన ఇంటికి తరలించారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఫిలింఛాంబర్లో అభిమానుల సందర్శనార్థం వేణుమాధవ్ పార్థివదేహాన్ని ఉంచనున్నారు. ఆ తర్వాత నగరంలోని బన్సీలాల్ పేటలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. మంగాపురం కాలనీ నుంచి అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది.

Similar News