అంధురాలిగా అవమానాలు.. ఐఏఎస్ ఆఫీసరై గౌరవ సత్కారాలు

Update: 2019-10-15 05:53 GMT

కళ్లున్న వాళ్లకే కష్టం.. ఈ ఉద్యోగానికి మీరెలా అర్హులు.. మీ పోస్టింగ్ ఆర్డర్స్ క్యాన్సిల్.. మీకు తగ్గ మరే ఉద్యోగమైనా చూసుకోండి అంటూ అవమానించి పంపించేశారు. ఆమెకు పట్టుదల మరింత పెరిగింది. అవమానాలు అధిగమించి కళ్లున్న వారికి సైతం సవాలు విసురుతూ ఐఏఎస్ ఆఫీసరైంది. అంధురాలైన తొలి ఐఏఎస్ ఆఫీసర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు ప్రంజల్ పాటిల్. మహారాష్ట్రలోని ఉల్లాస్ నగర్‌కు చెందిన ప్రంజల్ అధిక జ్వరంతో బాధపడుతూ తన 6వ ఏట చూపు కోల్పోయింది.

బిడ్డ చూపు కోల్పోయిందని తల్లిదండ్రులు బాధపడ్డా పెంపకంలో ఆమెకు ఆ విషయమే మరిచి పోయేలా చేశారు. కళ్లున్న వారితో సమానంగా పెంచారు. ఎప్పుడూ నిరుత్సాహపడవద్దని ఆత్మవిశ్వాసాన్ని నింపారు. అమ్మానాన్నల ప్రోత్సాహం.. తన కష్టం కలగలిసి ఐఏఎస్ ఆఫీసర్‌గా ప్రంజల పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. ప్రతిష్టాత్మక జేఎన్‌యూలో అంతర్జాతీయ వ్యవహారాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అనంతరం 2016లో తొలిసారి యూపీఎస్సీ రాసి 733వ ర్యాంకు సాధించింది. ఆ ర్యాంకుతో తనకు ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్ (ఐఆర్ఏఎస్)‌లో ఉద్యోగం వచ్చింది.

అయితే అంధురాలన్న కారణంతో ఆమెకు ఇచ్చిన పోస్టును రద్దు చేశారు. ఆ బాధను దిగమింగుకుని ఈ సారి మరింత పట్టుదలగా యూపీఎస్సీ పరీక్షలు రాశారు ప్రంజల్. 124వ ర్యాంకు వచ్చి ఐఏఎస్‌గా ఎంపికై, ఏడాది శిక్షణలో భాగంగా కేరళలోని ఎర్నాకులం అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. ఈ క్రమంలోనే తిరువనంతపురం డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. దేశంలోనే మొట్టమొదటి మహిళా అంధ ఐఏఎస్ ఆఫీసర్‌గా ప్రంజల్ రికార్డు సృష్టించారు. ఇక పురుషులలో మొట్టమొదటి అంధ ఐఏఎస్ ఆఫీసర్‌గా మధ్యప్రదేశ్‌కు చెందిన కృష్ణ గోపాల్ తివారీ రికార్డులకెక్కారు.

Similar News