నరేంద్ర మోదీ విశ్వజిత్ అని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. ప్రపంచంలో అగ్రగామిగా భారత్‌ను మోదీ నిలుపుతున్నారని కొనియాడారు. రాజమండ్రిలోని వేమగిరిలో నిర్వహించిన కూటమి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశానికి మోదీ అవసరం ఎంతో ఉందన్నారు. రాష్ట్రంలో టీడీపీ హయాంలో విశాఖను ఐటీ హబ్‌గా చేశామన్నారు. 2019లో ఒక్క ఛాన్స్ నినాదంతో ప్రజలు మోసపోయారన్నారు. జగన్ పాలనలో మొదటి బాధితులు యువతేనని అన్నారు.
జగన్ ఐదేళ్ల పాలనలో అడుగడుగునా కుంభకోణాలే అని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ‘కేంద్ర పథకాలను వైసీపీ తన పథకాలుగా చెప్పుకుంటోంది. కేంద్ర పథకాలకు జగన్, YSR పేర్లు పెట్టుకున్నారు. కేంద్రం ఇళ్లకు జగనన్న కాలనీలు అని పేరు పెట్టుకున్నారు. ఐదు కోట్ల మందిని జగన్ హింసించారు. విష ఘడియల నుంచి అమృత ఘడియలకు తీసుకెళ్లాలని మోదీని కోరాం. వైసీపీ అవినీతి కోటలను బద్దలు కొడుతున్నాం’ అని స్పష్టం చేశారు.
అయోధ్యకు శ్రీరామచంద్రుడిని తీసుకొచ్చిన మహానుభావుడు ప్రధాని మోదీ అని పవన్ కళ్యాణ్ కొనియాడారు. రాజమహేంద్రవరం కూటమి సభలో మాట్లాడిన ఆయన.. ‘భారత శక్తిని ప్రపంచానికి మోదీ చాటారు. దేశానికి అభివృద్ధితో పాటు గుండె ధైర్యం ఉండే నేత కావాలి. మోదీ నాయకత్వంలో ఉన్న మన దేశం వైపు పదేళ్లుగా శత్రువులు చూడాలంటేనే భయపడుతున్నారు. మోదీ గొంతెత్తితే దేశంలోని అణువణువూ స్పందిస్తోంది’ అని ప్రశంసలతో ముంచెత్తారు.