హర్యానా ఓటర్లు బీజేపీకి ఊహించని షాకిస్తున్నారు. ఎగ్జిట్‌పోల్స్‌లో వార్ వన్ సైడే అంటూ.. అన్ని సంస్థలు బీజేపీకి పట్టం కట్టాయి. కానీ ఇప్పుడు ఫలితాలు చూస్తే.. బీజేపీ మ్యాజిక్ పిగర్‌కు కాస్త దూరంగా నిలిచిపోతోంది. దీంతో హంగ్ తప్పేట్టు లేదు. బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. నిమిషనిమిషానికి ఆధిక్యాలు తారుమారవుతున్నాయి. మొత్తం 90స్థానాలు ఉండగా.. బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ కూటమి 40, కాంగ్రెస్ 32 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. అనూహ్యంగా JJP రేసులోకి దూసుకొచ్చింది. ఈ పార్టీ ఇక్కడ 10కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక INLD కేవలం 2 చోట్ల మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. హర్యానాలో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలన్నీ తారుమారయ్యాయి.
హర్యానాలో మ్యాజిక్ ఫికర్ 46. ప్రస్తుత ట్రెండింగ్ చూస్తూంటే ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫికర్‌ను దాటే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో JJP కింగ్ మేకర్‌గా అవతరించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అటు ఇండిపెండెంట్లు.. ఇతర చిన్నపార్టీలు కూడా చాలా కీలకం కానున్నాయి.
పరిణామాలను చూస్తుంటే JJP నేత.. దుష్యంత్ చౌతాలా కింగ్‌మేకర్‌గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌తోపాటు బీజేపీ కూడా సంప్రదింపులు ప్రారంభించాయి. JJP ఎవరికి మద్దుతు ఇస్తే వాళ్లే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. అటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇప్పటికే రాష్ట్ర నేతలతో మాట్లాడారు. భూపేందర్ హుడాకు పూర్తిస్వేచ్ఛను ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలని దిశానిర్దేశం చేశారు. జేజేపీ, స్వతంత్రులతో చర్చలు జరపాలని సూచించారు.
హర్యానాలో స్వతంత్రులు కూడా చాలా కీలకం కానున్నారు. దాదాపు 10 సీట్లలో ఇండిపెండెంట్లు గెలిచే అవకాశం కనిపిస్తోంది. అందుకే బీజేపీ స్వతంత్ర అభ్యర్థులపై ఫోకస్ చేస్తోంది. 40 మార్కును దాటితే మరో ఆరుగురు మద్దతు తీసుకుంటే ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని కమలనాథులు భావిస్తున్నారు. అటు బీజేపీ హైకమాండ్ హర్యానా ఫలితాలను పరిశీలిస్తోంది. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌ను ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించారు అమిత్ షా.