ఆఫర్లు వినియోగదారులను బుట్టలో పడేస్తాయి. నగలంటే మక్కువ చూపే నారీమణి.. ఇక బంగారం పండుగ దన్ తేరాసి వచ్చిందంటే మచ్చుకైనా ఓ చిన్న నగ కొనాలని ముచ్చటపడుతుంది. అమ్మవారి కరుణా కటాక్షాలతో పాటు ఆలి ముఖంలో ఆనందం చూడాలని ఇల్లాలికే ఓటేస్తాడు ఇంటాయన. కస్టమర్ల వీక్‌నెస్‌ని బేస్ చేసుకుని బంగారం వ్యాపారస్తులు కొనుగోళ్లను పెంచుకునే దిశగా ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తాయి. కొందరు మజూరి ఫ్రీ అంటే.. మరికొందరు తరుగు తక్కువగా ఉంటుందంటూ ఊరించేస్తారు.
అలాగే పాత బంగారం తీసుకురండి.. కొత్త బంగారం పట్టుకెళ్లండి అంటూ వల వేస్తారు. పాత బంగారం ఇచ్చి కొత్త బంగారం తీసుకునేటప్పుడు షాపు నిర్వాహకులు మాటలతో మాయ చేస్తారు. వారికి బంగారం మీద తరుగు, మజూరి ఛార్జీల రూపంలో లాభం వస్తుంది. మనం తీసుకెళ్లిన ఆభరణాన్ని ముందుగా పరీక్ష చేసి రేటు లెక్కకడతారు. తరుగు కింద ఆభరణం డిజైన్ బట్టి 4 నుంచి 30 శాతం ఉంటుందని వివరిస్తారు. భారీగా ఉన్న ఆభరణాలకు అయితే 18 నుంచి 28 శాతం కింద తరుగు వేస్తారని తెలుస్తోంది. ఇది రూ.26 వేల నుంచి రూ.40 వేల దాకా ఉంటుందని అంచనా. ఇలాంటి విషయాలను జాగ్రత్తగా గమనించుకుని బంగారం కొనుగోలు చేయడం మంచిది.