ప్రతి భారతీయుడు గర్వపడే సందర్భం ఇది - మోదీ

Update: 2019-10-25 16:29 GMT

జమ్మూ-కశ్మీరు బ్లాక్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ -BDC ఎన్నికలు సజావుగా జరగడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసే వార్త ఇది అంటూ ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల్లో 98 శాతం ఓటర్లు పాల్గొన్నారని చెప్తూ, విజయం సాధించిన అభ్యర్థులందరికీ అభినందనలు తెలిపారు మోదీ. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం వల్లే జమ్మూ-కశ్మీరు ప్రజలు తమ ప్రజాస్వామిక హక్కును ఉత్సాహంతో వినియోగించుకున్నారని ప్రధాని అన్నారు. హింస, కల్లోలం వంటివేవీ లేకుండా 98 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొనడం చరిత్రాత్మకమని తెలిపారు.

310 బ్లాకులకు జరిగిన ఎన్నికల్లో 1,080 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ ఎన్నికలను కాంగ్రెస్, జమ్మూ-కశ్మీరు డెమొక్రాటిక్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు బహిష్కరించాయి. ఇక ఈ ఎన్నికల్లో మొత్తం 27 మంది ఏకగ్రీవంగా ఎన్నికవగా అందులో 22 మంది బీజేపీకి చెందిన వారే.. ప్రాంతీయ అభివృద్ధి మండలి ఎన్నికల్లో కశ్మీరులోని శ్రీనగర్‌లో 100 శాతం ఓట్లు పోలవడం విశేషం.

Similar News