హర్యానాలో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కొలువు దీరనుంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య.. మనోహర్ లాల్ ఖట్టర్‌తో సీఎంగా ప్రమాణం చేయించనున్నారు. కింగ్‌మేకర్ దుష్యంత్ చౌతాలా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. ఈసారి 40 స్థానాలు మాత్రమే గెలిచిన బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో 10 సీట్లున్న జన్ నాయక్ జనతా పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమానికి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాతోపాటు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. బెయిల్‌పై బయటకు వచ్చిన దుష్యంత్ తండ్రి అజయ్ చౌతాలా కూడా కుమారుడి ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నారు.
ఛండీగఢ్‌లో శనివారం జరిగిన బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో బీజేఎల్పీ నేతగా ఖట్టర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అంతా ఖట్టర్‌కు మద్దతు పలికారు. గవర్నర్‌ను కలిసిన ఖట్టర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. దాంతోపాటే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా తన పదవికి రాజీనామా సమర్పించడంతో.. దాన్ని గవర్నర్ ఆమోదించారు. 2014లో అక్టోబర్ 26న సీఎంగా ఖట్టర్ ప్రమాణం చేశారు. నాటి కార్యక్రమానికి ప్రధాని మోదీ, అద్వానీ సహా మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పుడు రెండోసారి ప్రమాణ స్వీకారోత్సవానికి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని సీఎంలు మాత్రం వస్తున్నారు.