ఉత్కంఠగా మారిన 'మహా'రాజకీయం

Update: 2019-10-27 08:05 GMT

మహారాష్ట్రలో మైనార్టీ సర్కారే కొలువుదీరుతుందా..? అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు పిలుస్తారా..? తాజా పరిణామాలు చూస్తుంటే ఇలాంటిదే జరగొచ్చన్న భావన కలుగుతోంది. ముఖ్యమంత్రి పదవి పంపకం, మంత్రిపదవుల్లో వాటాలపై బీజేపీ-శివసేన మధ్య చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో సొంతగానే ముందుకువెళ్లాలని BJP భావిస్తుంది. ఈ పరిస్థితుల్లో క్షణక్షణం మారుతున్న పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి.

CM పదవి చెరో రెండున్నరేళ్లు పంచుకోవడంపై రాతపూర్వకంగా హామీకి శివసేన డిమాండ్ చేస్తోంది. ఐతే.. ఈ బెదిరింపులకు లొంగేది లేదని BJP ఇప్పటికే తేల్చి చెప్పింది. ఇండిపెండెంట్లు సహా చిన్న పార్టీలకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని కమలదళం అంటోంది. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ 105 సీట్లు గెలిచింది. చిన్నాచితకా పార్టీలు, ఇండిపెండెంట్లతో కలిపినా బీజేపీ బలం 120 మాత్రమే అవుతోంది. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 145 అందుకునేందుకు మిగతా పార్టీల సపోర్ట్ అవసరం. కానీ, 2014లో సీన్ మళ్లీ రిపీటవుతోందని... బీజేపీనేతలంటున్నారు.

2014లో సీట్ల విషయంలో తేడా వల్ల పొత్తు కుదరకపోవడంతో బీజేపీ-శివసేన విడిగా ఎన్నికలకు వెళ్లాయి. అప్పుడు బీజేపీ 122 సీట్లు నెగ్గింది. స్వతంత్రుల మద్దతు తీసుకున్నా కానీ 145 మ్యాజిక్ ఫిగర్‌కు చేరువ కాలేదు. శివసేన మద్దతుకు సరేమిరా అంది. ఐతే.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నుంచి ఆహ్వానం అందాక CMగా ప్రమాణం చేసిన దేవేంద్ర ఫడ్నవిస్‌ విశ్వాస పరీక్ష ఎదుర్కొన్నారు. శివసేన మద్దతు ఇవ్వకపోయినా NCP మద్దతుతో సభలో మూజువాణి ఓటుతో గట్టెక్కారు. ఇప్పుడు కూడా ఈ ఫార్ములా తెరపైకి వస్తున్నట్టు కనిపిస్తోంది. 2014లో BJP ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతిపక్షంలో కూర్చున్న శివసేన.. పదవుల విషయంలో కాంప్రమైజ్ అయ్యి తర్వాత ప్రభుత్వంలో చేరింది. ఇప్పుడు కూడా శివసేన అలాగే దారికి రావాలన్నది BJP ప్లాన్. కానీ, ఈసారి ఆదిత్య థాక్రేను CM చేయాలని పట్టుదలగా ఉన్న శివసేన.. తన రాజకీయ వ్యూహాన్ని ఎలా అమలు చేస్తుందన్నది ఆసక్తి రేపుతోంది.

బుధవారం MLAల మద్దతుతో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. దీంతో మరోసారి CMగా ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేస్తారు. బల నిరూపణకు ఎలాగూ 2 వారాలు సమయం ఉంటుంది కాబట్టి అప్పటికల్లా గేమ్ కొలిక్కి వస్తుందని అంచనా వేస్తున్నారు. శివసేన కాదంటే ప్రభుత్వానికి NCP మద్దతు ఇచ్చే ఛాన్సుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్సీపీ చీఫ్ శరద్‌ పవార్‌తో బీజేపీ ముఖ్యనేతలు టచ్‌లో ఉన్నారని అంటున్నారు. ఐతే.. ఇటీవల శరద్‌పవార్‌ పార్టీకి చెందిన ముఖ్య నేతలపై ఉన్న పాత కేసులన్నీ తెరపైకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఎన్సీపీ.. బీజేపీని నమ్మి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేది వేచి చూడాలి. తామైతే ప్రజాతీర్పును గౌరవించి ప్రతిపక్షంలో కూర్చుంటామని శరద్ పవార్ చెప్తున్నారు. మొత్తంగా బీజేపీ, శివసేన పోటాపోటీ ఎత్తులతో మరాఠా రాజకీయం రసకందాయంగా మారింది.

Similar News