మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. పులి తగ్గనంటే తగ్గనంటూ భీష్మించుకు కూర్చుంది. సీఎం కుర్చీ కావాలని పట్టుబడుతోంది. అటు 105 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ.. సీఎం సీటును వదులుకునేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు. దీంతో ఎన్నికల ముందు కంటే.. ఫలితాల తరువాతనే రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బీజేపీ, శివసేన స్పష్టత ఇవ్వకపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీతో సోమవారం ఇరు పార్టీల నేతలు వేరు వేరుగా భేటీ కావడం మరింత ఆసక్తి రేపుతోంది. ముందుగా శివసేన నేత దివాకర్ రౌత్ భేటీ కాగా.. ఆ తరువాత ఫడ్నవిస్ గవర్నర్‌తో సమావేశమయ్యారు. అయితే ఇది మర్యాద పూర్వక భేటీ అని.. దీని వెనుక ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు.
ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ...శివసేనతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి వెళ్లినప్పటికీ.. అనుకున్నస్థాయిలో రాణించలేకపోయింది. బీజేపీకి 105 సీట్లు వస్తే.. శివసేనకు 56 సీట్లు వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 145 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటులో ఆ పార్టీది కీలక పాత్ర కావడంతో అధికార పంపిణీ విషయంలో శివసేన ఎక్కడా తగ్గడం లేదు. ఇదే మంచి అవకాశం అంటూ.. అధికారాన్ని చెరోసగం పంచాల్సిందేనని గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఆధిత్య థాక్రేను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టేందుకు తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు సంక్లిష్టంగా మారింది.