తమిళనాడును భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా పడుతున్నాయి. రామనాథపురంతో పాటు పలు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతోంది. కాంచీపురం, ఆర్కేనగర్, వేలూరు, తిరుత్తణి, తూత్తుకుడి, తిరునెల్వేలి, తంజావూరు, తిరువారూరు, శివగంగై జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. విస్తారంగా పడుతున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థమైంది.
ఆదివారం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి కన్యాకుమారి వైపు కదులుతోంది. ఈశాన్య అరేబియా సముద్రం, లక్షద్వీప్, మాల్దీవులు వైపుగా వెళ్లి తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. ఇందులో భాగంగానే విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఆరు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. తిరునల్వేలి, ట్యుటికోరన్, తేని, విరుద్‌నగర్, వెల్లూర్, రామనాథపురం జిల్లాల్లో విద్యాలయాలను మూసివేశారు. మధురై జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్‌ను బంద్ చేశారు.
బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతుండటంతో మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు తెలిపారు. తమిళనాడు, కేరళతో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశాలున్నాయని హెచ్చరించారు. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.