కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ మరోసారి ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. ఎల్వోసీ వెంబడి మచిల్ సెక్టార్ వద్ద జరిపిన కాల్పుల్లో ఒక పౌరుడు మృతి చెందాడు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది.
ఓవైపు బోర్డర్‌లో పాక్ సైనికులు రెచ్చిపోతుంటే, మరోవైపు కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. సామాన్య పౌరులు లక్ష్యంగా కాల్పులు, గ్రనేడ్ దాడులకు తెగబడుతున్నారు. కుల్గాంలో కూలీలపై టెర్రరిస్టులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో బెంగాల్‌కు చెందిన ఆరుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. కూలీల మృతిపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్య క్తం చేశారు. కశ్మీర్‌లో స్థానికేతరుల భద్రతకు కేంద్రం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వరుస దాడులతో ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడానికి ఉగ్రదాడులు ప్రయత్నిస్తున్నారు. పుల్వామాలో ఆర్మీ వెహికిల్‌పై టెర్రరిస్టులు దాడి చేశారు. 44 రాష్ట్రీయ రైఫిల్స్ విభాగానికి చెందిన సైనికులు ప్రయాణిస్తున్న వాహనంపై కాల్పులు జరిపారు. టెర్రర్ అటాక్‌తో జవాన్లు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఆ ఏరియాను రౌండప్ చేసి ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్ కొనసాగుతుండగా మరోచోట దాడి జరిగింది. సీఆర్‌పీఎఫ్ బంకర్‌పై ముష్కరమూకలు దాడి చేశాయి. అక్కడ కూడా సైనికులు, ముష్కరుల మధ్య కాల్పులు జరిగాయి.