ఘోర రైలు ప్రమాదం.. 16 మంది సజీవదహనం

Update: 2019-10-31 04:57 GMT

పాకిస్థాన్‌లో గురువారం ఉదయం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. లాహోర్-కరాచీ మధ్య నడిచే తేజ్‌గ్రామ్ ఎక్స్‌ప్రెస్ రైల్లోని సిలెండర్ పేలి క్షణాల్లో బోగీలకు మంటలంటుకున్నాయి. ఈ ప్రమాదం కనీసం 16 మంది సజీవదహనం కాగా, 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో బోగీలు కాలి బూడిదయ్యాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదం ఉదయం పూట సంభవించడంతో ప్రాణనష్టం తక్కువగా ఉందని అధికారులు తెలిపారు. నాలుగు నెలల వ్యవధిలో పాక్‌లో చోటు చేసుకున్న రెండో అతిపెద్ద రైలు ప్రమాదం ఇది. ఈ ఏడాది జులై 11న రైల్వే స్టేషన్‌లో ఓ ట్రాక్‌పై నిలిచి ఉంచిన గూడ్స్ రైలును ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 30 మంది దుర్మరణం పాలవగా.. 80 మంది వరకు గాయపడ్డారు.

Similar News