దేశరాజధాని ఢిల్లీలో హెల్త్‌ ఎమర్జెన్సీ

Update: 2019-11-01 15:57 GMT

కాలుష్యం అంత్యత ప్రమాదకరస్థాయికి చేరడంతో.. దేశ రాజధాని ఢిల్లీలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. నవంబరు 5వరకు నిర్మాణాలపై నిషేధం విధించారు. అటు స్కూళ్లకు కూడా సెలవు ప్రకటిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఓవైపు పంట వ్యర్థాల దగ్ధం.. మరోవైపు బాణసంచాల మోత.. వాహనాల పొగ.. వెరసి దేశ రాజధానిని పొల్యూషన్ ఛాంబర్‌గా మార్చేశాయి. దీంతో కాలుష్య నియంత్రణ మండలి ఢిల్లీ-NCR ప్రాంతంలో ప్రజా ఆరోగ్య అత్యవసర స్థితి ప్రకటించింది.ఈ మేరకు ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ భురేలాల్ లేఖ రాశారు.

ఢిల్లీ-NCR ప్రాంతాల్లో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. అందుకే ఢిల్లీ ఫరీదాబాద్, గురుగ్రామ్, ఘజియాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతాల్లో నవంబరు 5 వరకు నిర్మాణ కార్యకలాపాలు, స్టోన్ క్రషర్లపై ఆంక్షలు విధించారు. ఈ శీతాకాలం మొత్తం బాణసంచా పేల్చడంపై నిషేధం విధించారు. బొగ్గు, ఇతర ఇంధన ఆధారిత పరిశ్రమలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టకుండా తక్షణ చర్యలు చేపట్టనున్నారు.

అధికారిక డేటా ప్రకారం.. దిల్లీ-NCR ప్రాంతంలో గాలి నాణ్యత సూచీ 582కు పడిపోయింది. సాధారణంగా గాలి నాణ్యత సూచీ 0-50 మధ్య ఉంటే బాగుందని భావిస్తారు. 500పైన ఉంటే ప్రమాదకరంతోపాటు ఎమర్జెన్సీగా పరిగణిస్తారు. ఇప్పుడు ఢిల్లీలో ఏకంగా గాలి నాణ్యత 582కు పడిపోయింది. అందుకే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు.

దేశ రాజధాని నగరం కాలుష్యం కోరల్లో చిక్కుకోవడంతో స్కూలు విద్యార్థులకు కాలుష్య నిరోధక మాస్క్‌లను పంచారు సీఎం అరవింద్ కేజ్రీవాల్ . ఢిల్లీవాసులకు 50 లక్షల ఎన్-‌95 మాస్కులు పంచుతున్నామని ప్రజలు ఈ మాస్క్‌లు ధరించి బయటకు వెళ్లాలని కోరారు. వాతావరణ కాలుష్యం దృష్ట్యా ఔట్‌డోర్ క్రీడా కార్యక్రమాలను తగ్గించుకోవాలని ఢిల్లీ సర్కార్ ఇటీవల అన్ని పాఠశాలలకు సూచనలిచ్చింది.

Similar News