సారూ.. సీఎం పోస్ట్ నాకివ్వండి.. సమస్యలు తీర్చేస్తా: రైతు లేఖ

Update: 2019-11-01 10:32 GMT

ఒకే ఒక్కడు సినిమాలో హీరో అర్జున్ నన్ను ఒక్క రోజు సీఎం చేయండి.. ఎన్ని పనులు చేయొచ్చో చూపిస్తాను. మీరేదో చేస్తారని.. మీ శుష్క వాగ్ధానాలు విని అమాయకపు ప్రజలు మీకు అధికారం కట్టబెడితే దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అయిదు సంవత్సరాలు అధికారంలో ఉంటే ఎన్ని సమస్యలు పరిష్కరించొచ్చు. దేశాన్ని సుభిక్షంగా పాలిస్తే ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు. మళ్లీ మీకే అధికార పీఠం అప్పగిస్తారు అని అంటాడు.. సరే ఒక రోజో.. ఒక నెలో.. అసలంటూ ప్రభుత్వం ఏర్పడితే కదా సమస్యలు పరిష్కరిస్తుందో లేదో తేల్చుకునేది. గవర్నమెంటే ఇంత వరకు ఫామ్ అవకుండా మీలో మీరు కొట్టుకోవడమే సరిపోతుంది.

ఓ పక్క ప్రజలు.. ముఖ్యంగా రైతులు ప్రకృతి ప్రకోపంతో కురిసిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని నానా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన మల్లగుల్లాలు పడుతుండడం రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో బీడ్ జిల్లాకు చెందిన శ్రీకాంత్ విష్ణు గడాలే అనే రైతు.. మీ సమస్య ఎప్పుడు తీరుతుందో కానీ మా సమస్యలు పరిష్కరించడానికి నన్ను సీఎం చేయండి అంటూ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారికి లేఖ రాశారు. ఆరుగాలం కష్టపడ్డ పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షంతో నోటిదాకా వచ్చిన కూడు నేలపాలైనట్టైందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తీవ్రంగా నష్టపోయిన సమయంలో ప్రభుత్వానికి తమ గోడు చెప్పుకుందామంటే.. అసలు ప్రభుత్వమే లేకపాయే అని తల పట్టుకుంటున్నారు. కుర్చీ పోరు తేలేంత వరకు ముఖ్యమంత్రి పదవిని తనకు అప్పగించాలని శ్రీకాంత్ కోరారు. ఓ రైతు ముఖ్యమంత్రి అయితే తోటి రైతుల సమస్యలు అర్థం చేసుకుని పరిష్కరించగలుగుతాడని ఆయన అన్నారు.

కాగా, మహారాష్ట్రలో మహా సంగ్రామం నడుస్తోంది. అధికారాన్ని సమంగా పంచుతారా సరేసరి.. లేదంటే తమ డిమాండ్ల విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గేది లేదని శివసేన గురువారం మరోసారి స్పష్టం చేసింది. అయిదేళ్ల పాలనలో ఓ రెండున్నరేళ్లు మీరు పాలిస్తే, మరో రెండున్నరేళ్లు మేము పాలిస్తాం. ఈ విషయంలో రాజీకి వచ్చే ప్రసక్తే లేదంటూ శివసేన భీష్మించుకు కూర్చుంది. దీంతో బీజేపీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఈ పరిస్థితుల్లో గవర్నర్‌కి రైతు రాసిన లేఖ సంచలనంగా మారింది.

Similar News