మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతునే ఉంది. ఈ నెల 7లోగా కొత్త ప్రభుత్వం ఏర్పడకపోతే.. రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశముందన్న బీజేపీ నేత సుధీర్ ముంగంటివర్ వ్యాఖ్యలపై శివసేన తీవ్రంగా స్పందించింది. రాష్ట్రపతి పాలన పేరిట బీజేపీ బెదిరింపులకు దిగుతోందా అని శివసేన నేత సంజయ్ రౌత్ ప్రశ్నించారు. అటు శివసేన అధికారిక పత్రిక సామ్నా సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహరాష్ట్రకు అవమానం, రాష్ట్రపతి మీ జేబులో ఉన్నారా ? అన్న శీర్షికతో సంపాదకీయాన్ని ప్రచురించింది.
ముంగంటివర్ వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యతిరేకమని, మహారాష్ట్ర ప్రజల తీర్పు అవమానించడమేనంది సామ్నా పత్రిక. బీజేపీ వైఖరి విషపూరితంగా మారిందనడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. రాష్ట్రపతి బీజేపీ నియంత్రణలో ఉన్నారా? లేక రాష్ట్రపతి స్టాంప్ బీజేపీ కార్యాలయంలో ఉందా? అంటూ విమర్శనాస్త్రాలు సంధించింది. రాష్ట్రపతి పదవి అనేది రాజ్యాంగం కల్పించిన ఓ అత్యున్నత సంస్థ అన్న సామ్నా పత్రిక.. రాష్ట్రపతి ఓ వ్యక్తి కాదు.. దేశం మొత్తానికి ప్రతినిధి అంటూ రాసుకొచ్చింది. దేశం ఎవరి జేబుల్లో లేదంటూ సంపాదకీయానికి ముంగింపు పలికింది సామ్నా పత్రిక.