తెలంగాణ కేబినెట్‌ సమావేశం.. చర్చించే అంశాలివే..!

Update: 2019-11-02 09:21 GMT

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన... కేబినెట్‌ సమావేశం కానుంది. ఇందులో ఆర్టీసీ సమ్మె సహా ఎజెండాలోని మరో 40 అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్టీసీ సమ్మె 28 రోజులకు చేరిన నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోబోతోంది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ఉన్న అవకాశాలపై ఈ భేటీలో ప్రభుత్వం పరిశీలన జరపనుంది.

రాష్ట్రంలోని 4 వేల రూట్లలో ప్రైవేటు బస్సులను నడపడానికి పర్మిట్లు జారీ చేసే ప్రతిపాదనలపై రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ప్రైవేటు రూట్ల పర్మిట్ల జారీకి సంబంధించి విధివిధానాలు, నోటిఫికేషన్‌ జారీ తదితర అంశాలపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే సుప్రీంకోర్టుకు వెళ్లే అంశాన్ని సైతం మంత్రివర్గంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

దీంతోపాటు గాంధీ 150వ జయంతి సందర్భంగా 10 మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష పెట్టే అంశం, భాషా పండితులు, పీఈటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతిపైనా చర్చించే అవకాశం ఉంది. అన్ని జిల్లాల్లో, పోలీస్‌ కమిషనరేట్లలో ఫింగర్‌ ప్రింట్‌ అనాలసిస్‌ యూనిట్ల ఏర్పాటు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై వంటి వాటిపై నిర్ణయం తీసుకోనున్నారు. కోర్టుల్లో పోస్టులు మంజూరుతోపాటు,సమాచార పౌర సంబంధాల శాఖలో 36 పోస్టుల మంజూరుపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ను ఆర్‌అండ్‌బీలో విలీనంతోపాటు గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కొత్త పోస్టులకు కేబినెట్ అనుమతి ఇచ్చే అవకాశంపైనా చర్చించనున్నారు.

Similar News