సీఎంగా ఫడ్నవీస్ రాజీనామా..

Update: 2019-11-08 11:54 GMT

 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. శుక్రవారం అర్దరాత్రితో అసెంబ్లీ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్‌కు రాజీనామా లేఖ అందజేశారు. మరోవైపు.. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత రాలేదు. బీజేపీ-శివసేన మధ్య డీల్ కుదరలేదు. ముఖ్యమంత్రి పీఠంపై పీటముడి ఏర్పడింది. తొలుత తమకు సీఎం పదవి ఇవ్వాలంటూ శివసైనికులు పట్టు పడుతున్నారు.

దీంతో బీజేపీ-శివసేన కూటమి ఏర్పాటుకు అవకశాలు కనిపించటంలేదు. ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయం కూడా కీలకంగా మారింది. ఇప్పటికిప్పుడు రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసే అవకాశాలు తక్కువేనని చెప్తున్నారు. అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రచారం శివసేనలో కలకలం రేపుతోంది.

ప్రభుత్వ ఏర్పాటులో సాగదీతపై శివసైనికుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. కొందరు బీజేపీతో కలిసి వెళ్దామని ప్రతిపాదిస్తుండగా.. మరికొందరు కమలనాథులపై తమ ఆధిపత్యం కొనసాగాలని కోరుతున్నారు. ఇప్పుడు బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానిస్తే.. కొందరు ఎమ్మెల్యేలు గోడ దూకే అవకాశం లేకపోలేదని శివసేన నాయకత్వం భావిస్తోంది. దీంతో.. ముందు జాగ్రత్త చర్యగా శాసనసభ్యులను క్యాంప్‌నకు తరలించారు. శివసేన పార్టీ కార్యాలయం మాతోశ్రీ దగ్గర్లోని ఓ హోటల్‌లో క్యాంప్ కొనసాగుతోంది.

Similar News