పనిమనిషికి ఓనరమ్మ సాయం.. ఐడియా అదిరింది..

Update: 2019-11-08 10:23 GMT

ఆరోగ్యం బాగా లేకపోయినా అమ్మగారు అరుస్తారని చెప్పిన టైమ్‌కి వచ్చేయాలి పనివాళ్లు. తనకు వచ్చిన కష్టం చెప్పుకుందామంటే వినేవాళ్లే ఉండరు. అందరూ అలానే ఉంటారా అంటే చెప్పడం కష్టం. కానీ ఎక్కువ శాతం మందికి పనిమనుషుల కష్టం సుఖం పట్టించుకునే తీరిక ఉండదు. ఒక్కరోజు రాకపోయినా ఒళ్లంతా హూనం అయిందే తల్లి. ఇంట్లో పనంతా చేసేసరికి అంటూ అమ్మగారు ఆపసోపాలు పడుతుంది. ఇక ఈ బిజీ లైఫ్‌లో పక్కవారి గురించి ఆలోచించే టైమ్ అసలు ఉండదు. కానీ పూణేకు చెందిన ధనశ్రీ షిండే అని బిజినెస్ ఎగ్జిక్యూటివ్ వద్ద గీతా కాలే అనే మహిళ పనికి కుదిరింది. నాలుగిళ్లలో పనిచేసుకుంటూ గీత తన కుంటుంబాన్ని పోషించుకుంటోంది.

ఓ రోజు దిగాలుగా ఉన్న గీతను చూసి.. ఏమైంది.. ఏంటి అలా ఉన్నావని ఓనరమ్మ అడిగింది. అమ్మా నేను పని చేసే మరో ఇంటి వాళ్లు పనిలోనుంచి తీసేసారు. అక్కడ పని చేసినందుకు రూ.4000 ఇస్తారు. వచ్చే నెల నుంచి ఆ డబ్బులు లేకపోతే ఇంటి పోషణ భారం కష్టంగా మారుతుందమ్మా అంటూ దీనంగా చెప్పేసరికి ధనశ్రీ మనసు కరిగింది. దీనికి పరిష్కారం ఏంటా అని ఒక్క క్షణం ఆలోచించింది. వెంటనే ఓ ఐడియా వచ్చింది. కంప్యూటర్ ముందు కూర్చుని గీత పేరు మీద విజిటింగ్ కార్డు ప్రిపేర్ చేసింది. దాంట్లో గీత చేసే పనుల వివరాలు.. ఏ పనికి ఎంత చార్జి వసూలు చేస్తుంది అనే విషయాలు రాసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.

అంట్లు తోమడానికి రూ.800, ఇల్లు ఊడ్చడానికి రూ.800, బట్టలు ఉతకడానికి రూ.800, రొట్టెలు చేయడానికి రూ.1000లు. కావలసిన వారు సంప్రదించ వలసిన ఫోన్ నెంబర్ అంటూ గీత నెంబర్ రాసి పోస్ట్ చేసింది. అది చూసిన అస్మితా జవదేవకర్ అనే నెటిజన్ షేర్ చేయడంతో చాలా మంది ఫోన్లు చేయడం ప్రారంభించారు. పని కోల్పోయానని బాధపడుతున్న గీతకు ఇప్పుడు కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి పనికి రమ్మంటూ. ఒక చోట పని కోల్పోతే ఇప్పుడు నాలుగు చోట్ల పని దొరికిందని సంతోషపడుతోంది గీత. పనిమనిషి కోసం ధనశ్రీ చేసిన ఆలోచన సూపర్‌గా ఉందంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Similar News