బుల్‌బుల్‌ తుపానుపై మోదీ సమీక్ష

Update: 2019-11-10 13:17 GMT

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బుల్‌బుల్‌ తుపానుపై సమీక్ష జరిపారు. బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీతో ఫోన్‌లో మాట్లాడారు. కేంద్రం నుంచి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను నేపథ్యంలో బెంగాల్‌, ఒడిశా ప్రభుత్వాలు సహాయక చర్యలు చేపట్టాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తుపాన్ పరిస్థితిని సమీక్షిం చారు. సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశా రు. లక్షా 24 వేల మందిని ప్రత్యేక శిబిరాలకు తరలించారు. కోల్‌కతాలో చెట్టుకూలి ఒకరు, ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో గోడ కూలి మరొకరు చనిపోయారు.

మరోవైపు ఢిల్లీలో కేబినెట్ సెక్రటరీ కార్యదర్శి రాజీవ్ గౌబ నేతృత్వంలో జాతీయ సంక్షోభ నివారణ కమిటీ తుఫాన్ ప్రభావం, సహాయక కార్యక్రమాలపై సమీక్షించింది. సహాయక చర్యల కోసం NDRF, తీర ప్రాంత గస్తీ సిబ్బందిని సిద్ధం చేసింది. విశాఖపట్నంలో 3 నౌకలు సహాయక సామగ్రితో సిద్ధంగా ఉన్నాయి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎరియల్ సర్వే, సహాయక సామగ్రి చేరవేతకు ఐఎన్‌ఎస్ డేగా ఎయిర్ స్టేషన్ వద్ద నౌకాదళనికి చెందిన హెలీకాప్టర్లను సిద్ధం చేశారు.

బంగ్లాదేశ్‌కు కూడా ముప్పు పొంచి ఉంది. తీర ప్రాంతాలపై ప్రభావం చూపే అవకాశముండడంతో ముందు జాగ్రత్తగా 18 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే 3 లక్షల మందిని రిలీఫ్ షెల్టర్లకు తరలించారు. ఒడిషా, పశ్చిమబెంగాల్, పారాదీప్, బంగ్లాదేశ్ తీరాల్లో గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, మత్య్సకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని ప్రభుత్వం సూచించింది.

బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడి పెనుతుపాన్‌గా మారింది. ఈ తుపాను శనివారం రాత్రి 8 గంటలకు బెంగాల్‌లోని సాగర్ ద్వీపం దగ్గర తీరం దాటింది. అనంతరం సుందర్బన్ డెల్టా మీదుగా బంగ్లాదేశ్ వాయవ్య దిశగా కదిలి క్రమంగా బలహీనపడింది.

Similar News