ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకే ఢిల్లీ వచ్చాం : నాదెండ్ల మనోహర్

Update: 2019-11-16 13:25 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. శుక్రవారం అకస్మాత్తుగా విజయవాడ నుంచి హస్తిన వెళ్లిన పవన్‌ కల్యాణ్‌.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాని కలుస్తారనే ప్రచారం జరుగుతోంది. కేంద్రమంత్రులతో భేటీ అవుతారని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిస్థితులపై చర్చిస్తారంటున్నారు. అయితే ఆయన హస్తిన పర్యటనపై ఇప్పటికీ క్లారీటీ లేదు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చామని ఆ పార్టీ నేత నాదెండ్ల చెప్తున్నా.. కేంద్రప్రభుత్వ, బీజేపీ అగ్రనేతలతో మంతనాలు జరుగుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది..

మరోవైపు... ఢిల్లీలోనే ఉంటూ... వైసీపికి ట్విట్టర్‌లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పవన్‌ కల్యాణ్‌. సీఎం జగన్ టార్గెట్‌గా విరుచుకుపడ్డారు. ఢిల్లీలో జగన్ పరిస్థితి ఇది అంటూ... కాళ్లకు ఇసుక బస్తాలు కట్టుకొని సీఎం నడుస్తున్న ఫోటోను ట్యాగ్‌ చేశారు. ఢిల్లీలో జగన్‌పై ఇలాంటి అభిప్రాయమే ఉందంటూ ట్వీట్‌ చేశారు..

అంతటితో ఆగలేదు 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీ అసెంబ్లీలో 151 స్థానాల్లో ప్రజలు గెలిపిస్తే, వచ్చిన ఐదు నెలల్లోనే 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల ఉపాధిని తీసివేశారంటూ విమర్శించారు. 50 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయేలా చేసిన ఘనత వైసీపీకే దక్కిందంటూ మరో ట్వీట్‌ చేశారు పవన్‌.

మొత్తానికి పవన్‌ ఢిల్లీ వెళ్లడం, అక్కడి నుంచి... జగన్‌ సర్కారును టార్గెట్‌ చేస్తూ ట్వీట్‌ పెట్టడంతో ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కాయి. విశాఖ లాంగ్ మార్చ్ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు పవన్. అవసరమైతే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తానన్నారు.టీడీపీ, బీజేపీ సైతం పవన్‌ సభకు, ఆయన చేసిన వ్యాఖ్యలకు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో పవన్ ఢిల్లీ పర్యటన మరింత ఆసక్తి రేపుతోంది.

Similar News