ప్రభుత్వ భద్రతతో మహిళలను శబరిమల ఆలయానికి తీసుకెళ్లడం సాధ్యం కాదు : కేరళ ప్రభుత్వం

Update: 2019-11-16 01:30 GMT

శబరిమల ఆలయ తలుపులు శనివారం తెరుచుకోనున్నాయి. శనివారం సాయంత్రం ఐదు గంటలకు అర్చకులు ఆలయ ద్వారాలు తెరుస్తారు. పూజల అనంతరం ఆదివారం నుంచి భక్తులను ప్రవేశానికి అనుమతిస్తారు. డిసెంబర్ 27 వరకు మండల పూజ మహోత్సవం నిర్వహిస్తారు. తర్వాత మూడు రోజుల విరామం. డిసెంబర్ 30 నుంచి జనవరి 21 వరకు మకర విలక్కు మహోత్సవం. జనవరి 15న మకర జ్యోతి దర్శనం ఉంటుంది.

అయ్యప్ప ఆలయంలో పూజలు మొదలు కానుండడంతో కేరళ ప్రభుత్వం పకడ్బందీ భద్రత చర్యలు చేపట్టింది. పదివేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసింది. వీరిలో 307 మంది మహిళా సిబ్బంది కూడా భద్రతా విధులు నిర్వర్తించనున్నారు. 1185 మంది ఎస్సైలు రంగంలో ఉంటారు. 264 మంది సీఐలు వాళ్లను పర్యవేక్షిస్తారు. 112 మంది డిఎస్పీలు, 24 మంది ఎస్పీ, ఎస్పీ అధికారులను మోహరిస్తున్నారు. వీళ్లకు అదనపు డీజీపీని ముఖ్య సమన్వయ కర్తగా నియమించింది ప్రభుత్వం. సన్నిధానం, పంబా, నీలక్కల్, ఎరిమేలి, పత్నంతిట్ట ప్రాంతాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేసింది. 1560 మంది ప్రత్యేక బలగాలు మోహరించాయి.

మరోవైపు శబరిమల ఆలయ తలుపులు శనివారం తెరుచుకోనున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ కేసును సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసిన నేపథ్యంలో ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించే విషయంలో గందరగోళం నెలకొంది. అయితే, కేరళ ప్రభుత్వం మాత్రం అయ్యప్ప దర్శనానికి వెళ్లే మహిళలకు భద్రత కల్పించలేమని స్పష్టం చేసింది. ప్రభుత్వ భద్రతతో మహిళలను ఆలయానికి తీసుకెళ్లడం సాధ్యం కాదని తేల్చేసింది. అసలు ఇలాంటి ఆలోచనలు తమ ప్రభుత్వ పరిశీలనలో లేవని కేరళ ప్రభుత్వం వెల్లడించింది. ఆలయంలోకి వెళ్లాలనుకున్న మహిళలు కోర్టు అనుమతి తెచ్చుకోవాలని తేల్చేసింది. శాంతియుత వాతావరణం కోసమే తాము కృషి చేస్తామని కేరళ ప్రభుత్వం చెబుతోంది. ఆలయం వద్ద యథాతథ స్థితి కొనసాగించడమే మంచిదని భావిస్తోంది.

Similar News